Petrol Price Hike | అనుకున్నదే జరిగింది. గత కొన్నిరోజులుగా పెట్రోల్ ధరల పెంపుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భారీగా పెరగడంతో దేశీయంగా ప్రభావం కనిపిస్తోంది. సామాన్యుడిపై మరోసారి భారంగా మారేలా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు ఒకేసారి రూ.3 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఒక్కసారిగా వాహనదారులకు షాక్ తగిలినట్లయ్యింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.97.77కు చేరగా, డీజిల్ ధర రూ.90.67గా నమోదైంది.
Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!
పెట్రోల్, డీజిల్ ధరల్లో ఒక్కసారిగా వచ్చిన ఈ పెరుగుదలతో రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు, సరుకు రవాణాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.3.29 పెరిగి లీటరుకు రూ.108.74కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.3.14 పెరిగి రూ.106.68గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.2.83 పెరగడంతో కొత్త ధర రూ.103.67గా నిర్ణయించారు. డీజిల్ ధరల విషయానికి వస్తే కోల్‌కతాలో లీటరుకు రూ.3.11 పెరిగి రూ.95.13కు చేరింది. ముంబైలో కూడా డీజిల్‌పై రూ.3.11 పెంపుతో ధర రూ.93.14గా పెరిగింది. చెన్నైలో డీజిల్ ధర రూ.2.86 పెరిగి లీటరుకు రూ.95.25కి చేరగా.. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.110.88, డీజిల్ 98.96కి ఎగబాకింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో భగ్గుమంటున్న క్రూడాయిల్
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వరుసగా ఎగబాకుతున్న నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపడంతో దేశీయ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో నష్టాలను తగ్గించుకునేందుకు ఇంధన ధరలను సవరించే దిశగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల పెరుగుదల కారణంగా ఇంధన విక్రయాల్లో కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయని, రోజువారీగా వేల కోట్ల రూపాయల భారం పడుతోందని పలు నివేదికలు తెలిపాయి. చమురు సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను పూర్తిగా భర్తీ చేయాలంటే లీటరుకు కనీసం రూ.15 నుంచి రూ.20 వరకు ధరలు పెంచాల్సి వస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అంత భారీగా ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం మరింత పెరగడంతో పాటు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Read Also : థ్యాంక్స్ సీఎం రేవంత్..! సీఎం రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్ పాలాభిషేకం..!
సామాన్యులపై ప్రభావం..
ప్రపంచంలో అత్యధికంగా క్రూడాయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇరాన్-గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ సరఫరా వ్యవస్థను దెబ్బతీశాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో క్రూడాయిల్ రవాణా మందగించడం, వంటగ్యాస్ సరఫరాపైనా ప్రభావం పడుతున్నట్లు పేర్కొంటున్నారు. దేశ అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85 శాతం వరకు భారత్ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రతి నెలా కోట్ల టన్నుల క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న దేశం, అంతర్జాతీయ ధరల మార్పుల ప్రభావానికి నేరుగా గురవుతోంది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీ ఆర్థిక భారం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!
ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు గత కొన్ని వారాలుగా వేల కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ధరలను పెంచేందుకు కేంద్రం సైతం అనుమతి ఇచ్చింది. చమురు ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రవాణా వ్యయం పెరగడంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయ రంగం, సరుకు రవాణా రంగంపై అదనపు ఒత్తిడి పడనుంది. మరోవైపు పెట్రోల్ ధరల పెంపుతో వ్యక్తిగత వాహనదారుల ఖర్చులు కూడా పెరగనున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది మరో భారంగా మారనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read Also : జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ.. ఈడీ కేసులో పిటిషన్ వెనక్కి తీసుకున్న శ్రీలంకన్ బ్యూటీ..!


