ఆకాశంలోనే ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డ న‌లుగురు..!

ఇడాహోలో జరిగిన ఎయిర్ షో (Air Show)లో తృటిలో పెను ప్ర‌మాదం తప్పింది. గగన విన్యాసాల సమయంలో రెండు యుద్ధ విమానాలు (Fighter Jets) ఢీకొనగా, నలుగురు సిబ్బంది పారాచూట్లతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

US Accident | అమెరికాలోని ఇడాహో రాష్ట్రంలో నిర్వహించిన ఎయిర్ షోలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. గగన విన్యాసాల సమయంలో అమెరికా నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ విమానాలు ఆకాశంలోనే ఢీకొట్టుకున్నాయి. అయితే, ప్రమాదం ఎంత తీవ్రంగా కనిపించినా, విమానాల్లో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడడం ఊరటనిచ్చింది. ఈ ఘటన ఆదివారం మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో జరిగింది. నేవల్ ఎయిర్ ఫోర్సెస్ అధికారుల సమాచారం ప్రకారం.. వాషింగ్టన్‌లోని విడ్బే ఐలాండ్‌కు చెందిన ఎలక్ట్రానిక్ ఎటాక్ స్క్వాడ్రన్-129కు చెందిన రెండు EA-18G గ్రోవ్లర్ యుద్ధవిమానాలు విన్యాసాల సమయంలో ఢీకొన్నాయి. ప్రమాదాన్ని త‌ర్వాత వెంట‌నే పైలట్లు, ఇతర సిబ్బంది పారాచూట్ల సహాయంతో విమానాల నుంచి బయటకు దూకారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు. ఎయిర్‌బేస్‌లో ఉన్న ప్రేక్షకులు, సిబ్బందికి ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేద‌ని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్‌ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!

గాల్లో అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు ఒక్కసారిగా ఢీకొనడం, వెంటనే సిబ్బంది పారాచూట్లతో కిందికి దూకడం, ఆ తర్వాత విమానాలు నేలపై కూలి మంటల్లో చిక్కుకోవడం వంటి దృశ్యాలు వీడియోల్లో క‌నిపించింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఎయిర్ షోను నిలిపివేసి, భద్రతా కారణాల దృష్ట్యా బేస్ మొత్తాన్ని మూసివేశారు. విమానయాన భద్రతా నిపుణుడు జెఫ్ గుజెట్టి మాట్లాడుతూ గాల్లోనే రెండు యుద్ధవిమానాలు ఢీకొన్నప్పటికీ సిబ్బంది సురక్షితంగా బయటపడటం చాలా అరుదైన విషయ‌మ‌ని చెప్పారు. ఢీకొన్న తర్వాత విమానాలు కొంతసేపు ఒకదానికొకటి చిక్కుకున్నట్టుగా కిందికి రావడంతో సిబ్బందికి బయటపడే అవకాశం లభించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది సాంకేతిక లోపం కంటే మానవ తప్పిదం కారణంగా జరిగి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మరో విమానయాన నిపుణుడు జాన్ కాక్స్ మాట్లాడుతూ, ఎయిర్ షో విన్యాసాలు అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటాయని, చిన్నపాటి పొరపాటు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఘటనపై అమెరికా నౌకాదళం పూర్తి స్థాయి విచారణ ప్రారంభించింది. ప్ర‌మాదానికి సంబంధించి త్వ‌ర‌లోనే వివ‌రాలు బ‌య‌టే ప‌డే అవ‌కాశాలున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »