జెఫ్ బెజోస్‌కు ఎదురుదెబ్బ‌.. టెస్టింగ్ స‌మ‌యంలో పేలిపోయిన బ్లూ ఓరియ‌న్ రాకెట్‌…!

అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనవరల్ లాంచ్ కాంప్లెక్స్–36 వద్ద బ్లూ ఒరిజిన్ (Blue Origin) న్యూ గ్లెన్ రాకెట్ (New Glenn rocket) హాట్ ఫైర్ టెస్ట్ (engine firing test) సమయంలో పేలిపోయింది. ఈ ఘటనలో రాకెట్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని సంస్థ ప్రకటించింది.

జెఫ్ బెజోస్‌కు ఎదురుదెబ్బ‌.. టెస్టింగ్ స‌మ‌యంలో పేలిపోయిన బ్లూ ఓరియ‌న్ రాకెట్‌…!

Blue Origin | అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఓరియ‌న్ కంపెనీ భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. కొత్తగా అభివృద్ధి చేసిన న్యూ గ్లెన్ రాకెట్ (New Glenn rocket) పరీక్షల సమయంలో పేలిపోయింది. ఇంజిన్ ఫైరింగ్ కోసం నిర్వహిస్తున్న హాట్ ఫైర్ టెస్ట్ (engine firing test) కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టెస్టింగ్ ద‌శ‌లో ఉన్న రాకెట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి, ఆకాశంలో అగ్నికీళ‌లు ఎగిసిప‌డ్డాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో సమీప ప్రాంతాల్లోని ఇళ్లకు వ‌ర‌కు ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయ‌ని స్థానికులు తెలిపారు. కొన్ని క్షణాల్లోనే ఆకాశం నారింజ రంగు మంటలతో ప్రకాశిస్తూ స్పష్టంగా కనిపించిన దృశ్యాలు అక్కడి వారిని కలవరపరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారాయి.

Read Also : చంద్రుడి ద‌క్షిణ ధ్రువంలో మూన్ బేస్ ఏర్పాటు చేయ‌నున్న నాసా.. ప్రైవేటు సంస్థ‌ల‌తో కీల‌క ఒప్పందాలు..!

అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బ్లూ ఒరిజిన్ (Blue Origin) స్పష్టం చేసింది. ఎక్స్ వేదికగా విడుదల చేసిన ప్రకటనలో సంస్థ.. “నేటి హాట్ ఫైర్ టెస్ట్ సమయంలో అనూహ్య సాంకేతిక లోపం (technical glitch) తలెత్తింది. అన్ని ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారు. ఎవరూ గాయపడలేదు” అని తెలిపింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు కూడా సంస్థ వెల్లడించింది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని పేర్కొంది. స్థానిక అత్యవసర సేవల విభాగాలు కూడా ఈ పరిణామంపై స్పందించాయి. పేలుడు అనంతరం విషపూరిత పొగ, ఇతర ప్రమాదకర పరిస్థితులు లేవని ఏర్ప‌డ‌లేద‌ని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా సంక్షిప్తంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో ఆయన స్పందించారు. చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, రాకెట్స్ ట‌ఫ్ అంటూ వ్యాఖ్యానించారు.

Read Also : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ప్రారంభించనున్న ప్రధాని.. జులై నుంచి సర్వీసులు షురూ..!

న్యూ గ్లెన్ రాకెట్ గతంలోనూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో జరిగిన ప్రయోగంలో ఇంజిన్ వైఫల్యం కారణంగా ఒక ఉపగ్రహాన్ని త‌ప్పుడు కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విష‌యం తెలిసిందే. ఇది న్యూ గ్లెన్ రాకెట్‌కు కేవలం మూడో ప్రయోగంగా భావిస్తున్న సమయంలోనే ఈ వరుస సమస్యలు వెలుగులోకి రావడం గమనార్హం. నాసా (NASA) మూన్ మిష‌న్ కోసం ల్యాండర్లను పంపేందుకు బ్లూ ఒరిజిన్ ఈ భారీ రాకెట్‌ను అభివృద్ధి చేస్తోంది. అంతరిక్ష రంగంలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX)తో పోటీ పడేందుకు జెఫ్ బెజోస్ సంస్థ ఈ ప్రాజెక్టును అత్యంత కీలకంగా భావిస్తోంది. అమెరికా తొలి వ్యోమగామి జాన్ గ్లెన్ (John Glenn) పేరు మీదుగా ఈ రాకెట్‌కు న్యూ గ్లెన్ అనే పేరు పెట్టారు. భూమిని చుట్టి వచ్చిన తొలి అమెరికన్ వ్యోమగామిగా ఆయన చరిత్ర సృష్టించారు.

 

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »