University Faculty Recruitment | ఏపీలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,523 అధ్యాపక పోస్టుల నియామకానికి అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఈ భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 1,244 రెగ్యులర్ కాగా.. మిగిలిన 279 బ్యాక్‌లాగ్ కింద ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయి పోస్టులకు రాత పరీక్ష లేకుండా నిబంధనల ప్రకారం నేరుగా నియామకాలు చేపట్టనున్నారు. నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.
Read Also : భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు..!
కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజీ సదుపాయం
ఇప్పటికే వర్సిటీల్లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. సర్వీస్ అనుభవం ఆధారంగా వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి ఏడాది సర్వీసుకు రాత పరీక్షలో 0.5 శాతం చొప్పున మార్కులు కేటాయించనుండగా, గరిష్ఠంగా 10 సంవత్సరాలకు 5 శాతం వరకు వెయిటేజీ లభిస్తుంది. ఇంటర్వ్యూలో కూడా అనుభవానికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున, గరిష్ఠంగా 10 మార్కులు ఇవ్వనున్నారు. అయితే ఈ వెయిటేజీ పొందాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఇందుకు సంబంధించిన కాంట్రాక్ట్ అధ్యాపకుల వివరాలను సమగ్రంగా పంపాలని వర్సిటీలను ప్రభుత్వం ఆదేశించింది.
Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు రగడ.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం..!
వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
భర్తీ చేయనున్న పోస్టుల్లో అత్యధికంగా రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 125, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 103 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాత పరీక్షల్లో అభ్యర్థుల అర్హత మార్కుల విషయంలో కేటగిరీ వారీగా నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం, బీసీలకు 35 శాతం, ఇతర అభ్యర్థులకు 40 శాతం కనీస అర్హత మార్కులుగా ఖరారు చేశారు. ఈ నియామక ప్రక్రియతో రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరత తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : టీచర్ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!


