MSME Growth Summit | ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహక చర్యలు చేపడుతోంది. పారిశ్రామిక రంగాన్ని గ్రామీణ స్థాయికి విస్తరించాలనే లక్ష్యంతో విజయవాడలో సోమవారం నిర్వహించిన ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక ప్రకటనలు చేయగా.. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు ఆయన వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. సమ్మిట్ వేదికగా ప్రత్యేకంగా నిర్మించిన అంబేద్కర్ కళావేదికను కూడా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తోందని సీఎం వివరించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి అవసరమైన ‘ప్లగ్-అండ్-ప్లే’ సదుపాయాలతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తొలి రెండు దశల్లో దాదాపు 100 పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనలు జరగగా, వాటిలో కొన్ని కార్యకలాపాలు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ దిశగా మెటా, అమెజాన్, జోహో వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందాల ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, ఈ-కామర్స్ అవకాశాలు మరింతగా పెరుగుతాయని అధికారులు తెలిపారు.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలకు ఊతమివ్వడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ సెంటర్’ ఎక్స్‌టెన్షన్ కేంద్రాలను సీఎం ప్రారంభించారు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ కేంద్రాల ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార మార్గదర్శకత్వం, మార్కెటింగ్ సహాయం అందించనున్నారు. ఇక రాష్ట్రంలోని 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిన్న పరిశ్రమలకు అవసరమైన యంత్రాలు, పరీక్షా కేంద్రాలు, నిల్వ సదుపాయాలు, శిక్షణ వంటి అంశాలు ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి రానున్నాయి. సదస్సుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారులు, బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. పరిశ్రమల రంగంలో పెట్టుబడులు, అవకాశాలు, సవాళ్లపై పలు సాంకేతిక సెషన్లు నిర్వహించారు.
Read Also : కాంగ్రెస్ సర్కారు తెలంగాణ గొంతు కోసేందుకు రెడీ అయ్యింది.. మాజీ మంత్రి సింగిరెడ్డి విమర్శలు..


