ఆక్వా రైతుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. విద్యుత్ భారం త‌గ్గించేందుకు కీల‌క నిర్ణ‌యం..!

ఆక్వా రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ వర్తింపజేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. బ్లూ ఎకానమీ (Blue Economy) అభివృద్ధి, మత్స్యకారుల ఆదాయం పెంపు, ఆధునిక రైతు బజార్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Power Subsidy | ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మంగ‌ళ‌వారం క్యాంపు కార్యాయ‌ల‌యంలో వ్యవసాయం, మత్స్యశాఖ, అనుబంధ రంగాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు ఉపశమనం కలిగించే పలు నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటైన ఆక్వా విద్యుత్ కనెక్షన్లకూ సబ్సిడీ వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ అందిస్తోంది. ఇప్పటివరకు ఈ రాయితీ పాత కనెక్షన్లకే పరిమితమై ఉండగా, తాజాగా రిజిస్ట్రేషన్ పొందిన 12,680 కొత్త కనెక్షన్లకూ ఇదే సబ్సిడీ వర్తింపజేయనున్నారు.

Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

దీంతో వేలాది మంది ఆక్వా రైతులకు విద్యుత్ ఖర్చుల భారం తగ్గనుంది. ఇప్పటికే సుమారు 50 వేల ఆక్వా కనెక్షన్లకు ప్రభుత్వం ఏటా రూ.1,100 కోట్ల మేర సబ్సిడీ ఇస్తుండగా, తాజా నిర్ణయంతో అదనంగా మరో రూ.188 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో విస్తరించిన ఆక్వా సాగును సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న దాదాపు నాలుగు లక్షల ఎకరాల ఆక్వా ప్రాంతాన్ని దశలవారీగా ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాణ్యత ప్రమాణాలు, ట్రేసబిలిటీ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా రంగాన్ని భవిష్యత్తులో ‘బ్లూ ఎకానమీ’గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం పేర్కొన్నారు.

Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాల‌కృష్ట సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తీరప్రాంత మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రూ.240 కోట్ల వ్యయంతో 200 ఆధునిక మెకనైజ్డ్ బోట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. సముద్రంలో చేపల వేటకు సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రంలోని చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు వంటి అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకాన్ని మరింత విస్తరించాలని సీఎం ఆదేశించారు. స్థానిక మత్స్యకార సంఘాలకు ప్రాధాన్యం కల్పిస్తూ ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను ఆధునికీకరించే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో ఆధునిక సదుపాయాలతో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులు నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు విక్రయించేలా ‘డిజి రైతు బజార్’ యాప్‌ను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. స‌మీక్ష‌లో మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్ర‌సాద్‌తో పాటు వివిధ‌శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »