Balakrishna | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ (APFDC) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను తెలుగు సినిమా పరిశ్రమకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గట్టిగా పనిచేస్తోందని చెప్పారు. 1975లో ఉమ్మడి రాష్ట్రంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రారంభమైందని, రాష్ట్ర విభజన అనంతరం 2017లో ఏపీలో ప్రత్యేక సంస్థగా రూపుదిద్దుకుందని గుర్తుచేశారు. ఇది పరిశ్రమ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి టాలీవుడ్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
Read Also : కాంగ్రెస్ సర్కారు తెలంగాణ గొంతు కోసేందుకు రెడీ అయ్యింది.. మాజీ మంత్రి సింగిరెడ్డి విమర్శలు..
తెలుగు సినిమాల మొత్తం వసూళ్లలో దాదాపు 70 శాతం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని బాలకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సభ అనంతరం రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు ఈ లెక్కలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సహజసిద్ధమైన లొకేషన్లు విస్తారంగా ఉన్నాయని, తాను నటించిన ‘అఖండ’ చిత్ర షూటింగ్‌ను కూడా రంపచోడవరంలోనే చిత్రీకరించామని ఆయన గుర్తు చేశారు. “నేను చేసినంతగా సినిమాలు ఏపీలో మరెవ్వరూ చేసి ఉండకపోవచ్చు” అని వ్యాఖ్యానించారు. షూటింగ్ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని తక్షణం అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులపై కూడా బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సాంకేతిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ సినిమాలు వేగంగా పూర్తయ్యేవని, ఇప్పుడు అధునాతన సాంకేతికత ఉన్నా నిర్మాణ దశ ఎక్కువ సమయం తీసుకుంటోందని అన్నారు. షూటింగ్‌లు తగ్గిపోవడంతో సినీ యూనియన్లకు ఉపాధి అవకాశాలు తగ్గాయని, పంపిణీ రంగంలో కూడా ఒడిదొడుకులు నెలకొన్నాయని పేర్కొన్నారు. అనేక థియేటర్లు తాళాలు వేసే పరిస్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకప్పుడు సినిమా ఎలా ఉండాలో ఆలోచించేవాళ్లం, ఇప్పుడు పరిశ్రమనే నిలబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాతలు మరిన్ని చిత్రాలు నిర్మించి థియేటర్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Also : ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ.. భూముల విలువ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్..!


