AP Weather | ఉదయం ఎనిమిది గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం అయితే బయట అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి. ఈసారి ఎండలు ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్నాడు జిల్లా అగ్నిగుండంలో మారింది. గురువారం ఏకంగా 48.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత దశాబ్దంలోనే ఇది అత్యధిక ఉష్ణోగత్రలు కావడం విశేషం. ఇక బుధవారం 47.1 డిగ్రీలు నమోదైన విషయం తెలిసిందే. ఒకే రోజు వ్యవధిలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. అచ్చంపేటలోనూ 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట మాత్రమే కాదు.. రాత్రివేళల్లోనూ వేడి తగ్గకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పల్నాడు జిల్లా అమరావతి మండలం మల్లాదిలో రాత్రి 7 గంటల సమయంలోనే 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా సాయంత్రం తర్వాత కాస్త వాతావరణం చల్లబడుతుందని భావించినా ఏమాత్రం ఊరటనివ్వలేదు.
Read Also : ప్రభుత్వ వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతి..!
వాతావరణ నిపుణులు ఏమంటున్నారంటే..
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. బలమైన ఎల్‌నినో (El Niño) ప్రభావం, గాలిలో తేమశాతం తగ్గిపోవడం, బంగాళాఖాతంలో అల్పపీడనాల లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దాంతో సాధారణం కంటే 7 నుంచి 8 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉత్తర భారతంలోని ఢిల్లీ వరకు ఇదే ప్రభావం కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఏపీ వ్యాప్తంఆ 20 జిల్లాల్లోని దాదాపు 200 మండలాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, ప్రకాశం, కృష్ణా, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేటపాలెం, నందివాడ, నందిగామ, అద్దంకి, చింతలపూడి ప్రాంతాల్లో 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 279 మండలాలు వడగాలులకు ప్రభావితమయ్యాయి. ఇందులో 60 మండలాల్లో తీవ్ర వడగాలులు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. వడదెబ్బ కారణంగా విజయనగరంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Read Also : ఎగ్జిబిటర్ పర్సంటేజ్ వివాదం.. పరిష్కారానికి రంగంలోకి తెలుగు ఫిలిం ఛాంబర్
మరో వారం ఇదే పరిస్థితి..
రాబోయే వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, రాయలసీమతో పాటు నెల్లూరు, పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, వేడి ప్రభావం పూర్తిగా తగ్గేందుకు మరికొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురిస్తే తప్ప ఈ వేడి ప్రభావం నుంచి బయటపడలేమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Read Also : పట్టపగలే చుక్కలు కనిపించేలా అలుముకోనున్న చీకట్లు..! శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్యగ్రహణం..!


