Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యాధునిక నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇందుకోసం రూ.1,234.91 కోట్ల వ్యయాన్ని కేంద్రం మంజూరు చేసింది. ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుండటం విశేషం. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) ఈ నిర్మాణ పనులను చేపట్టనుంది. ఇప్పటికే ప్రాథమిక ప్రక్రియలు ప్రారంభమయ్యాయని, టెండర్ డాక్యుమెంట్ల రూపకల్పన తుది దశకు చేరుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
అమరావతిలో నిర్మించబోయే ఈ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామడేషన్ (జీపీఆర్ఏ) ప్రాజెక్టు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న తొలి భారీ నివాస సముదాయం కానుంది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపుదిద్దుతున్నారు. సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ క్యాంపస్‌లో 11 భారీ రెసిడెన్షియల్ టవర్లు ఏర్పాటు చేస్తారు. టైప్-2 నుంచి టైప్-6 వరకు వివిధ కేటగిరీల్లో మొత్తం 1,504 నివాస యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగుల వాహనాల కోసం 1,972 కార్లు నిలిపే సామర్థ్యంతో ప్రత్యేక బేస్‌మెంట్ పార్కింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 31.30 లక్షల చదరపు అడుగులకు పైగా ఉండనుంది. కేంద్ర ఉద్యోగులకు నాణ్యమైన నివాస వసతి కల్పించడమే కాకుండా, కార్యాలయాలకు సమీపంలోనే నివాసాలు ఉండేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. దీంతో ఉద్యోగుల ప్రయాణ సమయం తగ్గి, వారి పనితీరు మెరుగుపడటంతో పాటు ప్రభుత్వ సేవల సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్టును గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. కనీసం 4-స్టార్ గ్రీహా రేటింగ్ లక్ష్యంగా ఇంధన పొదుపు, వర్షపు నీటి సంరక్షణ, స్థానిక నిర్మాణ సామగ్రి వినియోగం వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. క్యాంపస్‌లో నివాసాలతో పాటు బ్యాంకు, ఏటీఎం, పోస్టాఫీస్, కమ్యూనిటీ సెంటర్, ఫుడ్ కోర్ట్, షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహం వంటి అన్ని అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులకు అనుకూలంగా అవరోధ రహిత మౌలిక వసతులను కూడా కల్పించనున్నారు. ఇక ఉపాధి పరంగా కూడా ఈ ప్రాజెక్టు గణనీయమైన ప్రభావం చూపనుంది. నిర్మాణ దశలో ప్రతి ఏడాది సుమారు 7 లక్షల పనిదినాలు సృష్టికానుండగా, ప్రాజెక్టు పూర్తైన తర్వాత నిర్వహణ, సేవల రంగాల్లో ఏటా దాదాపు 50 వేల పనిదినాల ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అమరావతి అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.


