విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్ర‌మాదం.. స‌ల‌స‌ల‌మ‌రిగే ఉక్కుప‌డి ఎనిమిది మంది స‌జీవ ద‌హ‌నం..!

విశాఖ స్టీల్‌ప్లాంట్ (Visakhapatnam Steel Plant) జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మ‌రికొంద‌రు కార్మికులు గాయ‌ప‌డ్డారు. ద్రవ ఉక్కు (molten steel) ల్యాడిల్ కూలిపోవడం (ladle collapse) కారణంగా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Tragedy at Visakhapatnam Steel Plant: 8 Workers Burnt Alive in SMS-2 Industrial Accident, Several Injured

Vizag Steel Plant Accident | విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన ఘోర పారిశ్రామిక ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్టీల్ మెల్టింగ్ షాప్–2 (SMS-2) విభాగంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో కనీసం ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. వేడి వేడి ద్రవ ఉక్కు (మోల్టెన్ స్టీల్)ను తీసుకెళ్తున్న ల్యాడిల్స్‌ను కన్వేయర్-క్రేన్‌తో తరలిస్తున్న సమయంలో అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భారీ ల్యాడిల్స్ ఒక్కసారిగా కుప్పకూలి, కింద పనిచేస్తున్న కార్మికులపై మరుగుతున్న ఉక్కు ద్రవం పడిపోయింది.

స‌జీవ ద‌హ‌నం..

ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమీపంలో ఉన్న మరికొందరు తీవ్ర గాయాలు, కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉండ‌గా.. వారిని కాపాడి స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళాలు, ప్లాంట్ భద్రతా సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు, శిథిలాలను తొలగించేందుకు ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాడిల్ వ్యవస్థ కూలిపోవడానికి గల సాంకేతిక కారణాలు, భద్రతా లోపాలపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం సమగ్ర విచారణకు ఆదేశించింది.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం, పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగాలని ఆదేశించిన ఆయన, ప్లాంట్‌లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావాలని స్పష్టం చేశారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని అధికారులను ఆదేశించారు. స్థానిక మంత్రులు, జిల్లా యంత్రాంగం స్వయంగా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొత్తం ఘటనతో స్టీల్ ప్లాంట్‌తో పాటు సమీప నివాస ప్రాంతాల్లో కూడా విషాద చాయ‌లు అలుముకున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »