Talliki Vandanam | చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా చేపట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే లబ్ధిదారులకు నిధులు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న రాష్ట్రంలోని పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తొలుత జూన్ 12న నిధులు జమ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగినప్పటికీ, అర్హుల జాబితా ఖరారు ప్రక్రియ కొనసాగుతున్న కారణంగా జూన్ 19న నిధుల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ప్రయోజనం చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేయనుండగా, అందులో రూ.13 వేలును తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన రూ.2 వేలును పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షలకు పైగా లబ్ధిదారుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అర్హులైన కుటుంబాలు ఎవరూ నష్టపోకుండా, అదే సమయంలో అనర్హులు జాబితాలో చోటు దక్కించుకోకుండా ప్రత్యేక ధృవీకరణ చేపడుతున్నారు. గ్రామ, వార్డు స్థాయిలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం, కేవైసీ వివరాలు సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఆధార్ లింక్ లేకపోవడం, ఖాతాలు నిలిచిపోవడం, వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండటం వంటి కారణాలతో కొందరికి నిధుల జమ ఆలస్యమైన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఈసారి ముందస్తుగానే అన్ని వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు.
సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా యాక్టివ్‌గా ఉందో లేదో పరిశీలించుకోవడం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు వివరాలు సరైనవిగా నమోదు అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకు లేదా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. అర్హుల తుది జాబితా సిద్ధమైన వెంటనే ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. నిధుల జమ తేదీపై కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.


