River-Linking Plan | మహానది-గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు మరింత ప్రయోజనం చేకూరేలా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మహానది నుంచి వచ్చే జలాలను నేరుగా ధవళేశ్వరం బ్యారేజీకి తరలించే పాత ప్రతిపాదనకు బదులుగా, పోలవరం జలాశయానికి మళ్లించే కొత్త మార్గానికి జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA) సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మార్పుల ద్వారా మహానది నుంచి సుమారు 147 టీఎంసీల నీరు పోలవరం వరకు చేరే అవకాశం ఏర్పడింది. హైదరాబాద్ వేదికగా జరిగిన సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. అంతర్రాష్ట్ర జలవనరుల నిపుణుల అధ్యయనం ఆధారంగా రూపొందించిన తాజా ప్రతిపాదనపై సానుకూల స్పందన వ్యక్తమైంది. ఒడిశా సరిహద్దు దాటిన తర్వాత మహానది జలాలను ఏ మార్గంలో గోదావరి బేసిన్‌కు తరలిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే అంశాన్ని పరిశీలించి ఈ ప్రణాళికను రూపొందించారు.
Read Also : ప్రభుత్వ వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతి..!
హిరమండలం మీదుగా పోలవరానికి
ప్రతిపాదన ప్రకారం.. మహానది జలాలు ముందుగా మహేంద్రతనయ నదిలోకి ప్రవేశిస్తాయి. అనంతరం అవి వంశధారలో కలుస్తాయి. మహేంద్రతనయ ఉపనది వంశధారపై ఉన్న గొట్టా బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో ఉండటంతో, అక్కడి నుంచి నదీ ప్రవాహం ద్వారానే నీటి తరలింపు సాధ్యమవుతుంది. దీంతో కొత్త కాలువల నిర్మాణ అవసరం గణనీయంగా తగ్గనుంది. వంశధారలో చేరిన జలాలను గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం జలాశయానికి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం అక్కడ నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథక సామర్థ్యాన్ని అవసరమైతే మరింత పెంచే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హిరమండలం నుంచి మడ్డువలస మీదుగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టుకు, అక్కడి నుంచి ఏలేరు జలాశయానికి నీటిని తరలిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎత్తిపోతల వ్యవస్థలు, మరికొన్ని చోట్ల సొరంగ మార్గాలు ఏర్పాటు చేసి చివరకు పోలవరం జలాశయానికి మహానది జలాలను చేర్చేలా ప్రతిపాదనలు చేశారు.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. నరసన్నపేటలో ప్రకటించిన చంద్రబాబు..
ఉత్తరాంధ్రకు వరం
ఈ అనుసంధానం అమలైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు నీటి భద్రత మరింత బలోపేతం కానుంది. వంశధార, నాగావళి, ఏలేరు పరిధిలోని సాగునీటి అవసరాలు తీరడంతో పాటు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు కూడా తోడ్పడుతుంది. భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక వినియోగానికి కూడా ఈ జలాలు ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు కూడా ఈ మార్పు కీలకంగా మారనుంది. ప్రస్తుతం మహానది నుంచి గోదావరిలోకి చేరే అదనపు 147 టీఎంసీల నీటిని దక్షిణాది రాష్ట్రాలకు మళ్లించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఈ జలాలను పంచే అవకాశాలపై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర జలసంఘం పోలవరం నుంచి నల్లమలసాగర్, బనకచర్ల, సోమశిల మార్గంలో కావేరి బేసిన్‌కు నీటిని తరలించే ప్రత్యామ్నాయ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది. తెలంగాణలో సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్ సమీపం వరకు చేపట్టే జల మళ్లింపు కార్యక్రమంతో పాటు ఈ ప్రణాళికను అనుసంధానించే అంశంపై అంతర్గత స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ దేవేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజినీర్ సుగుణాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు రాధాకృష్ణ, గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Read Also : ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!
నదుల అనుసంధానంతో కలిగే ప్రయోజనాలు
నదుల అనుసంధానం ద్వారా వరదల సమయంలో సముద్రంలో వృథాగా కలిసే నీటిని నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుంది. సాగునీటి విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. కరవు ప్రభావిత ప్రాంతాలకు నీటి భద్రత లభించడమే కాకుండా భూగర్భ జలాల స్థాయి మెరుగుపడుతుంది. తాగునీటి సరఫరా, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో కూడా ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రాల మధ్య జల వనరుల వినియోగానికి, ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి నదుల అనుసంధానం ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్ ఇదే..! బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ రివీల్..!