తెలంగాణలో ఐక్యత.. ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ : పవన్ కల్యాణ్

తెలంగాణ (Telangana) ప్రజల్లో ఉన్న ఐక్యతను ప్రశంసించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కుల రాజకీయాలు (Caste Politics) అధికమయ్యాయని వ్యాఖ్యానించారు. ‘జై ఆంధ్ర’ (Jai Andhra) నినాదం వెనుక ఉద్దేశం రాష్ట్ర ఐక్యతేనని చెబుతూ.. అభివృద్ధి ఆధారిత రాజకీయాలు (Development Politics) అవసరమని పేర్కొన్నారు.

Pawan Kalyan Calls for Andhra Unity, Slams Caste Politics and Regional Divisions

Pawan Kalyan | తెలంగాణ ప్రజల్లో కనిపించే ఐక్యత తనను ఆకట్టుకుంటుందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి ఉమ్మడి భావన లోపించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమ‌రావ‌తిలో పొట్టి శ్రీ‌రాములు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాంతీయత, కుల రాజకీయాలు అధికమయ్యాయని, అభివృద్ధి కోసం కనీసం ‘మేమంతా ఆంధ్ర’ అనే భావన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ అనే బలమైన అస్తిత్వ భావన కనిపిస్తోందని చెప్పారు. తమిళులకు తమ భాష, ప్రాంతంపై ఉన్న గౌరవం మాదిరిగానే తెలంగాణ ప్రజల్లోనూ ప్రాంతీయ చైతన్యం ఉందన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉమ్మడి గుర్తింపు కంటే ఉప ప్రాంతీయతలు, కుల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

Read Also : జెన్ జీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ‘సేనా గళం’.. ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

ఐక్య‌త కోస‌మే జై ఆంధ్ర‌

‘జై ఆంధ్ర’ నినాదాన్ని కూడా రాష్ట్రంలో ఐక్యత పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఇచ్చానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను అతిగా అర్థం చేసుకోవద్దని, రాష్ట్రాన్ని మరింతగా విభజించడం కాకుండా కలిపే ప్రయత్నమే చేస్తున్నానని చెప్పారు. ఇప్పటికే వివిధ అంశాల్లో విభజనలకు గురైన ఆంధ్రప్రదేశ్‌లో ఇకనైనా ఐక్యత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు ప్రమాదకర స్థాయికి చేరాయని విమర్శించారు. కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని వాటి నాయకులు ఎదిగినా, సామాన్య ప్రజలకు మాత్రం ఆశించిన ప్రయోజనాలు అందలేదన్నారు. కులాల పేరుతో రాజకీయాలు చేసే ధోరణికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును కూడా ఒకే కులానికి పరిమితం చేసే పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుల రాజకీయాలు, కుల దూషణలు పరాకాష్టకు చేరాయని ఆరోపించారు. జర్నలిస్టులను సైతం కులాల పేరుతో లక్ష్యంగా చేసుకున్న ఘటనలు జరిగాయని విమర్శించారు.

Read Also : తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. ఆంధ్రా నేతలకు కవిత వార్నింగ్‌

మౌనంతో సామాన్యుల‌కు న‌ష్టం..

ఒక దళిత యువకుడి హత్య కేసులోనూ, కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ ఘటనలోనూ అనేక సంఘాలు స్పందించలేకపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటి సందర్భాల్లో కుల సంఘాలు మౌనం పాటించడం వల్ల నాయకులు లబ్ధి పొందుతున్నారని, సామాన్య ప్రజలు మాత్రం నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు. కుల నిర్మూలన పూర్తిగా సాధ్యమవుతుందో లేదో చెప్పలేమని, కానీ కులాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం మాత్రం అత్యవసరమని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం, అభివృద్ధి, ఉపాధి వంటి కీలక అంశాలు పక్కనపడి కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలు కొనసాగడం దురదృష్టకరమన్నారు. కుల రాజకీయాలకు ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలని జనసేన నిర్ణయించుకుందని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారేనని, అందరి మద్దతుతోనే విజయం సాధ్యమైందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కులాల మధ్య ఐక్యతను ప్రోత్సహిస్తూ అభివృద్ధి ఆధారిత రాజకీయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Read Also : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంది.. స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »