Sena Galam | జనసేన పార్టీలో కొత్త రాజకీయ దిశకు శ్రీకారం చుడుతూ ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణతో పాటు నేటి యువత, ముఖ్యంగా జెన్-జీ తరానికి అనుగుణంగా తమ అభిప్రాయాలను వినిపించే వేదికగా ‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ఆయన, సమాజంలో విభజనలను ప్రోత్సహించే రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వ్యక్తుల తప్పులను కులాలు, మతాలు, ప్రాంతాలతో ముడిపెట్టి సామాజిక విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు పెరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు మొత్తం సామాజిక వర్గాన్ని బాధ్యులను చేయడం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి ధోరణులు సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని అన్నారు.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!
ఈ సందర్భంగా రాజకీయాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న కొన్ని పాత పద్ధతులపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి విమర్శలు చేస్తే, అదే వర్గానికి చెందిన మరో వ్యక్తితో ఎదురుదాడి చేయించడం, కులాల వారీగా రాజకీయ ప్రతిస్పందనలు సృష్టించడం వంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయవని స్పష్టం చేశారు. ఇటువంటి బూర్జువా రాజకీయ సంస్కృతిని జనసేన పూర్తిగా తిరస్కరిస్తోందని తెలిపారు. జనసేన పార్టీ అభ్యుదయ భావాలతో ముందుకు సాగాలని, కాలం చెల్లిన రాజకీయ వ్యూహాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ‘సేనా గళం’ కమిటీని ఏర్పాటు చేసినట్లు పవన్ చెప్పారు. రాజకీయ పార్టీగా సామాజిక బాధ్యతను గుర్తించి ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు వేదిక కల్పించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని వివరించారు.
Read Also : భానుడి ప్రతాపానికి జనం విలవిల.. తూగో జిల్లాలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..!
కులం, మతం, ప్రాంతీయత వంటి భావోద్వేగ అంశాలను కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగత స్థాయిలో జరిగిన తప్పిదాలను పక్కదారి పట్టించేందుకు సామాజిక వర్గాల పేర్లు తెరపైకి తీసుకురావడం ప్రజల్లో అపోహలు, విభేదాలకు కారణమవుతోందన్నారు. అయితే నేటి యువత ఇలాంటి రాజకీయాలను అంగీకరించడం లేదని, సమస్యలపై నేరుగా చర్చించే రాజకీయ సంస్కృతినే కోరుకుంటోందని చెప్పారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇచ్చే విధంగా ‘సేనా గళం’ పనిచేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. దేశ సమగ్రతకు భంగం కలగకుండా, సమాజంలో ఐక్యతను పెంపొందించే అంశాలపైనే కమిటీ దృష్టి సారించాలన్నారు. యువత ఆలోచనలు, ప్రజా సమస్యలు, సమకాలీన అంశాలపై నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహించడం ద్వారా జనసేన కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలే గానీ, కులాలు లేదా మతాలను ఆ వివాదాల్లోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అనుసరిస్తోందని పవన్ కల్యాణ్ మరోసారి పునరుద్ఘాటించారు. ‘సేనా గళం’ కమిటీ ద్వారా అదే సందేశాన్ని సమాజానికి బలంగా చేరవేయాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.
Read Also : భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..


