Pawan Kalyan | తెలంగాణ గడ్డతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని, ఈ ప్రాంతంపై తనకు గాఢమైన అభిమానముందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తనపై వస్తున్న విమర్శలు, బెదిరింపుల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తీవ్రంగా స్పందించారు. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లోకి కీలక అడుగు వేస్తూ.. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని ప్రకటించారు. “హైదరాబాద్‌లో అడుగు పెడతావా, నీకేం పని ఇక్కడ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్నారు. తెలంగాణ ఏమైనా ఎవరి జాగీరా? ఇలాంటి బెదిరింపులకు నేను భయపడే వాడిని కాదు” అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురైనప్పుడు కూడా తెలంగాణ సమాజం అండగా నిలిచిందని గుర్తుచేశారు. “వారాహి వాహనానికి అనుమతులు ఇచ్చి నాకు తోడుగా నిలబడింది తెలంగాణ సమాజమే” అని పేర్కొన్నారు. జనసేన పార్టీ పుట్టుకే తెలంగాణ గడ్డపై జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఈ గడ్డకు నేను రుణపడి ఉన్నాను. దాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది” అని అన్నారు.
Read Also : ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. “రాష్ట్ర విభజన జరిగిన తీరు మాత్రమే నేను విమర్శించాను. పార్లమెంట్ తలుపులు మూసి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాను. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎప్పుడూ గౌరవించాను. సామాజిక తెలంగాణ రావాలని నేను కోరుకున్నాను” అని వివరించారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. “హైదరాబాద్‌లో నేను చెరువు భూమిని కబ్జా చేశానని అంటున్నారు. ప్రభుత్వం ఆ భూమిని పరిశీలించాలి. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు. చట్టపరమైన చర్యలకు కూడా నేను సిద్ధం” అని చెప్పారు. తనకు అధికారం మీద ఆశ లేదని, తెలంగాణలో రాజకీయ లాభం కోసమూ తాను రావడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ విస్తరణ, ఎన్నికల పోటీపై కూడా పవన్ కీలక ప్రకటన చేశారు. “ఇన్నాళ్లుగా కార్యకర్తలు, నాయకులు అడుగుతున్నారు. ఇక ఆగేది లేదు. నేను స్వయంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాను. రాబోయే ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా పోటీ చేస్తుంది” అని తెలిపారు. తనను విమర్శిస్తున్న వారు కనీసం తెలంగాణ అడవుల్లోనూ పర్యటించలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదాల వెనుక తప్పుడు ప్రచారం ఉందని ఆయన ఆరోపించారు. ఒక రాజకీయ విశ్లేషకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తన భేటీపై తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో వివాదం ప్రారంభమైందని చెప్పారు. “ఆ వ్యాఖ్యలను నేను ఖండించడంతోనే ఈ దుష్ప్రచారం మొదలైంది. ఆ తర్వాత నాపై తిట్ల దాడి జరిగింది” అని పేర్కొన్నారు.
Read Also : మహిళలకు తీపికబురు.. త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్‌కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం..!
తెలంగాణలో ఆంధ్రోళ్లను, ఆంధ్రాలో తెలంగాణ వారిని లక్ష్యంగా చేసుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది దేశ సమగ్రతకే ప్రమాదం. ప్రజలను పాలకుల తప్పులకు బాధ్యుల్ని చేయడం సరికాదు” అని అన్నారు. అలాగే పరిశ్రమలు రాకపోవడానికి, ఉపాధి సమస్యలకు ఆంధ్రులే కారణమని చెప్పడం తగదని వ్యాఖ్యానించారు. “తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు అయినా సమస్యలు ఉంటే దానికి ఒక్కరినే బాధ్యుల్ని చేయడం ఎలా సబబు? ఇలాంటి వాదనలు పెట్టుబడులను కూడా దూరం చేస్తాయి” అని హెచ్చరించారు. దేశ ఐక్యతపై కూడా ఆయన గట్టిగా వ్యాఖ్యానించారు. “సూరత్‌లో తెలుగువారు ఉండొద్దని గుజరాతీలు, నాందేడ్‌లో మనవాళ్లు ఉండొద్దని మహారాష్ట్రవారు అంటే దేశం ఎలా నిలబడుతుంది? మనమంతా భారతీయులం అనే విషయం మర్చిపోవద్దు” అని పవన్ అన్నారు. అలాగే రాజకీయ పార్టీల విస్తరణపై ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. “బీఆర్ఎస్ పార్టీని నేను ఎప్పుడూ ఆహ్వానించాను. గుంటూరులో కార్యాలయం పెట్టినా స్వాగతించాను. అలాంటప్పుడు జనసేనను మాత్రమే తెలంగాణలో అడ్డుకోవడం ఎందుకు?” అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ, “నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అలాంటప్పుడు తెలంగాణలో ఎందుకు ఆశిస్తాను?” అని వ్యాఖ్యానించారు. “జనసేన వస్తే ప్రజలు చైతన్యవంతులవుతారనే భయం కొందరికి ఉంది. అందుకే అడ్డుకుంటున్నారు” అని ఆరోపించారు.
Read Also : జెన్ జీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ‘సేనా గళం’.. ప్రకటించిన పవన్ కల్యాణ్


