Kavitha | తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోని లేదని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన’ రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారుల ఆకాంక్షలు, రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణ అంశాలపై మాట్లాడారు. గత 60-70 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు తమ బిడ్డలను కోల్పోతూనే ఉన్నారని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని కవిత అన్నారు. వారి త్యాగాలు ఇంధనంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే వారి కుటుంబాలకు ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వంటావార్పు, సకల జనుల సమ్మె వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామని, పక్కవారిని విమర్శించకుండా తమ ఉద్యమ ఆకాంక్షలను మాత్రమే ప్రజలకు తెలియజేశామని చెప్పారు. ఉద్యమాలు చేయాలంటే తెలంగాణ ప్రజల మాదిరిగా చేయాలనే స్థాయిలో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
Read Also : సీబీఎన్ అంటే బ్రాండ్.. మహానాడులో లోకేశ్ వ్యాఖ్యలు..
ఆంధ్రా నేతల ఏజెంటే ఇక్కడ సీఎం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతకాలం వరకు తెలంగాణవాదంపై గౌరవభావం ఉండేదని, కానీ ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. దీనికి కారణం ‘ఆంధ్రా రాజకీయ నాయకుల ఏజెంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండటం’ అని ఆరోపించారు. ‘ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు. ఒక కుట్ర ప్రకారం మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో ముఖ్యమైనది మన అస్తిత్వం. ఇప్పుడు మన అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతోంది’ అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన జరిగి దాదాపు 13 ఏళ్లు అవుతున్నా రాజధాని నిర్మించలేదని ఆమె విమర్శించారు. రాజధాని నిర్మాణంలో సంకీర్ణ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహానాడులో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ‘తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదంటూ మన వాళ్ల చేతనే అనిపించారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా తెలంగాణ పదం డిక్షనరీలో లేదని అంటాడా? రాజ్యాంగ బద్దంగా తెలంగాణను మనం సాధించుకున్నాం. రాజ్యాంగం తెలంగాణను ఇచ్చింది’ అని వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలకు కౌంటర్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ నవ నిర్మాణ సభ నిర్వహించనున్నారన్న వార్తలపై స్పందిస్తూ ‘ముందు లోకేష్, పవన్ కళ్యాణ్ మీ సెక్రటేరియేట్‌లో వానకాలం నీళ్లు రాకుండా చూసుకోండి. ప్రతి వానకాలంలో మీ రాజధాని మునుగుతుంటే, సెక్రటేరియేట్‌లో నీళ్లు వస్తుంటే ఆంధ్రా ప్రజలకు ఎంత అవమానం? అని ఘాటుగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘ఆంధ్రా నాయకులకు ఏమైనా అయ్యిందంటే హైదరాబాద్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం హాస్పిటల్స్ కట్టటం లేదు’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వ్యాపారాలు, షూటింగ్‌లు చేసుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వ్యాపారులకు రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పారు. అయితే, ‘మన సెక్రటేరియట్‌లో, మా రాజకీయాల్లో వేలు పెడతామంటే ఊరుకోం’ అని హెచ్చరించారు. ‘నేను అసలే మొండిదాన్ని, మీరు అనుకున్నంతా మంచిదాన్ని కాదు. మేం అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సల్ పంపుతా’ అని కవిత వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మేధావుల ఇళ్లకు ఆంధ్రా పోలీసులు వెళ్తున్నారని ఆరోపిస్తూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్, యాదగిరి వంటి వారు మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. ‘దమ్ముంటే మీరు రాజకీయంగా ఎదుర్కొండి’ అని సవాల్ విసిరారు.
Read Also : భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ప్రముఖ ఆలయాల్లోనూ సేవ భాగ్యం..
మాతో పెట్టుకుంటే మంచిగుండదు..
‘ఈ జెండా రాకముందు ఒకలా.. ఇప్పుడు ఒకలా. టీఆర్ఎస్ 2.0. మాతో పెట్టుకుంటే మంచిగ ఉండదు. ఒకసారి పెట్టుకుంటేనే తెలంగాణ తెచ్చుకున్నాం. మళ్లీ మా జోలికి వస్తే మూతి పళ్లు రాలుతాయి. మీ పంచాయితీలు, మీ సంస్కృతి మా మీద రుద్దుతామంటే ఊరుకోం’ అని హెచ్చరించారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలంతా తమవారేనని, వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు. అయితే తెలంగాణ నీళ్లు, రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమన్నారు. ‘మా అస్తిత్వాన్ని పరిరక్షించుకోవటమే మాకు ముఖ్యం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. కేకే, పీకే కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో ఎక్స్‌టెన్షన్ అవుతామంటూ లోకేష్ బాబు మాట్లాడుతున్నారు. ఇది సామ్రాజ్యం కాదు. ఆంధ్రా పార్టీలకు తెలంగాణలో ఓట్లు పడవనే ఇక్కడ దుకాణం బంద్ చేసిన విషయం గుర్తు లేదా?’ అని ప్రశ్నించారు. గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం తెలంగాణకు అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులు, అస్తిత్వ పరిరక్షణ కోసమే తమ పార్టీ ఏర్పాటైందని చెప్పారు. పాంచజనం అనే ఐదు అంశాలతో ముందుకు వెళ్తున్నామని, రైతులకు మేలు చేయడం నినాదం కాకుండా విధానం కావాలని అన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు రుణాలు అందిస్తామని తెలిపారు. సామాజిక తెలంగాణ సాధన అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, భవిష్యత్ తెలంగాణ నిర్మాణంపై ప్రజలు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
Read Also : ఏపీలో కొత్తగా 38 ఎంఎస్ఎంఈ పార్కులు.. గ్రోత్ సమ్మిట్‌లో చంద్రబాబు ప్రకటన..


