రూ.1.14లక్షల కోట్ల విలువైన బంగారాన్ని అమ్మేసిన ఆర్‌బీఐ..! బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో సంచలన విషయాలు..!

అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతల (US-Iran tensions) ప్రభావంతో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ విదేశీ మారక నిల్వలను (foreign exchange reserves) బలోపేతం చేయడానికి ఆర్‌బీఐ (RBI) సుమారు 12 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం విక్రయించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక పేర్కొంది. చమురు ధరల పెరుగుదల (oil prices rise) నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

Rising Oil Prices, Weak Rupee Concerns: Did RBI Turn to Gold Sales?

RBI-Gold | అమెరికా–ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పైనా పడుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడం, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడం కోసం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) సుమారు 12 బిలియన్‌ డాలర్ల (రూ.1.14 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని విక్రయించిందని బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌ నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో ఆర్‌బీఐ బంగారం విక్రయించడంతో పాటు సుమారు 7.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.71 వేల కోట్లు) విలువైన విదేశీ కరెన్సీ ఆస్తులను కూడా సమకూర్చుకుంది. ఈ బంగారం విక్రయాలపై ఆర్‌బీఐ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎగబాకుతున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారైన భారత్‌కు ఇది ఆందోళనకర పరిణామంగా మారింది. చమురు దిగుమతుల వ్యయం పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై, రూపాయి మారకపు విలువపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also : ఏపీలో స్వల్ప భూకంపం… వినుకొండ సమీపంలో 3.5 తీవ్రత, ప్రజల్లో ఆందోళన

బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌కు చెందిన సీనియర్‌ ఇండియా ఎకనామిస్ట్‌ అభిషేక్‌ గుప్తా విశ్లేషణ ప్రకారం.. దిగుమతి సుంకాల పెరుగుదల నేపథ్యంలో ఆర్‌బీఐ బంగారు నిల్వల విలువ పెరగాల్సి ఉండగా అందుబాటులో ఉన్న గణాంకాల్లో తగ్గుదల కనిపించింది. ఈ పరిణామం బంగారం విక్రయం జరిగి ఉండొచ్చన్న అంచనాలకు బలం చేకూరుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌ సంక్షోభం, హోర్ముజ్‌ జలసంధిలో నౌకాయాన అంతరాయాల కారణంగా చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వలను మరింత పటిష్ఠంగా, అవసరమైన సమయంలో సులభంగా వినియోగించుకునేలా ఉంచేందుకు ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుని ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. డాలర్‌ బలహీనపడటం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అనుకూల పరిస్థితులు ఏర్పడితే భవిష్యత్తులో ఆర్‌బీఐ విదేశీ కరెన్సీ ఆస్తులను మరింత పెంచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

Read Also : బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కుప్పకూలిన ధరలు.. తులం ఎంతంటే?

దేశంలోనే అధికంగా బంగారం నిల్వలు

2025 మార్చి చివరి నాటికి ఆర్‌బీఐ వద్ద 880.52 మెట్రిక్‌ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అందులో 77 శాతం బంగారం దేశంలోనే ఉండగా, ఆరు నెలల క్రితం ఈ వాటా 66 శాతంగా ఉంది. విదేశాల్లో ఉన్న బంగారంలో అధిక భాగం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ వద్ద భద్రపరిచినట్లు ఆర్‌బీఐ తన విదేశీ మారక నిల్వల నివేదికలో వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం అనంతరం పాశ్చాత్య దేశాలు రష్యా విదేశీ ఆస్తులను స్తంభింపజేసిన ఘటన తర్వాత.. విదేశాల్లో నిల్వ ఉంచిన ఆస్తుల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ కూడా ఇటీవలి సంవత్సరాల్లో తన బంగారు నిల్వల్లో గణనీయమైన భాగాన్ని భారత్‌కు తరలించినట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం విక్రయించిందన్న అంశంపై ఆర్‌బీఐ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, రూపాయిని బలోపేతం చేయడానికి వడ్డీ రేట్ల సర్దుబాట్లు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు సహా పలు మార్గాలను కేంద్ర బ్యాంక్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. బ్లూమ్‌బర్గ్‌ నివేదికలోని అంచనాలపై స్పష్టత రావాల్సి ఉంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య విదేశీ మారక నిల్వలు, రూపాయి స్థిరత్వాన్ని కాపాడేందుకు ఆర్‌బీఐ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందన్న దానిపై ఆర్థిక వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »