హైదరాబాద్ నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రద్దీ ప్రాంతాల్లో బాలకృష్ణ ఇల్లు కూడా ఉంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 సమీపంలో ఉన్న ఈ ప్రాంతం జూబ్లీ చెక్‌పోస్ట్, ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాహనాలకు ప్రధాన కూడలిగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం వన్‌వే విధానాన్ని అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో జంక్షన్ విస్తరణ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు. బాలకృష్ణ ఇల్లు కూడా కార్నర్‌లో ఉండటంతో రెండు వైపులా సెట్బ్యాక్ నిబంధనల ప్రకారం కొంత స్థలం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై బాలకృష్ణ అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
1982లో ఎన్టీఆర్ నిర్మించిన ఇల్లు
బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఈ నివాసానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ 1982లో బాలకృష్ణ కోసం ఈ ఇంటిని నిర్మించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ అనేక సమావేశాలు జరిగేవి. పార్టీకి సంబంధించిన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు కూడా ఈ ఇల్లు వేదికగా ఉండేది.
నందమూరి కుటుంబానికి సంబంధించిన అనేక వేడుకలు కూడా ఇదే ఇంట్లో జరిగాయి. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఇంటిని రోడ్డు విస్తరణలో భాగంగా ప్రజల అవసరాల కోసం ఇచ్చేందుకు బాలకృష్ణ సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
863 చదరపు గజాల స్థలం
రోడ్డు విస్తరణలో భాగంగా బాలకృష్ణ సుమారు 862.7 చదరపు గజాలు, అంటే దాదాపు 863 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ స్థలానికి ఎలాంటి నష్టపరిహారం తీసుకోకుండా ఇవ్వడానికి బాలకృష్ణ సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
ఈ ప్రాంతంలో ఒక్క గజం ధర సుమారు రూ. 4 నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన 863 చదరపు గజాల స్థలం విలువ దాదాపు రూ. 43 కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఇంటి విలువను కలుపుకుంటే మొత్తం ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు.
జీహెచ్ఎంసీకి సంబంధించిన టీడీఆర్ బాండ్లను తీసుకునేందుకు కూడా బాలకృష్ణ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొత్త ఇంటికి మారనున్న బాలకృష్ణ
బాలకృష్ణ ఇదే జూబ్లీహిల్స్ ప్రాంతంలో మరో చోట కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆ ఇంటి నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అనంతరం కొత్త ఇంటికి మారేందుకు బాలకృష్ణ సిద్ధమవుతున్న నేపథ్యంలో, తన తండ్రి ఎన్టీఆర్ నిర్మించిన పాత ఇంటిని రోడ్డు విస్తరణ కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే సిస్టమ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు గతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏడు జంక్షన్ల వద్ద ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌లు నిర్మించాలని భావించారు. ఆస్తుల సేకరణకు సుమారు రూ. 1,000 కోట్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి మరో రూ. 1,090 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
అయితే ఈ మొత్తం వ్యయం భారంగా మారుతున్న నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే సిస్టమ్‌ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. తొలుత ట్రయల్ రన్ నిర్వహించగా అది విజయవంతం కావడంతో శాశ్వతంగా వన్‌వే విధానాన్ని అమలు చేస్తున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి రావడానికి సుమారు ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో గతంలో ప్రతిపాదించిన పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను రద్దు చేశారు.
4.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్
జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
అదే సమయంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఏడు జంక్షన్లను అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో రోడ్ నంబర్ 45 సమీపంలోని జంక్షన్ కూడా ప్రధానమైనదిగా ఉంది.
ఒక వైపు రోడ్ నంబర్ 45 నుంచి వచ్చే వాహనాలు, మరోవైపు జూబ్లీ చెక్‌పోస్ట్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే వాహనాలు, ఐటీ కారిడార్ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్ వైపు వచ్చే వాహనాలు ఈ జంక్షన్ మీదుగా వెళ్తాయి. దీంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. బాలకృష్ణ ఇల్లు జంక్షన్ కార్నర్‌లో ఉండటంతో రెండు వైపులా స్థలం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
నష్టపరిహారం లేకుండా స్థలం ఇవ్వడంపై చర్చ
కేబీఆర్ పార్క్ చుట్టూ గతంలో రోడ్డు విస్తరణ కోసం ప్రైవేట్ ఆస్తులను మార్కింగ్ చేసిన సందర్భాల్లో పలువురు కోర్టులను ఆశ్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. నష్టపరిహారం లేదా టీడీఆర్ బాండ్లు వద్దని, తమ ఆస్తులు ఇచ్చేందుకు సుముఖంగా లేమని కొందరు కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది.
అలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ తన సొంత స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన ఆస్తిని ప్రజల అవసరాల కోసం ఇవ్వడానికి బాలకృష్ణ ముందుకు రావడంపై హైదరాబాద్ నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


