హైదరాబాదులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించినా, అందులో ఉండని వారికి నోటీసులు ఇచ్చారు అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండాలా, వెనక్కి తీసుకోవాలా అని వార్నింగ్ ఇచ్చారు. మూడు నెలల్లోపు ఇంట్లోకి రాకపోతే కేటాయింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. క్యూర్ పరిధిలో పదిహేను వేల ఇళ్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.
గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అందులో ఉండని లబ్ధిదారులపై చర్యలకు హౌసింగ్ కార్పొరేషన్ రెడీ అయింది. ఇళ్లల్లో ఉండని లబ్ధిదారులకు గతంలోనే నోటీసులు ఇచ్చారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. లబ్ధిదారులు తప్పనిసరిగా ఇళ్లలో ఉండాల్సిందేనని, లేదంటే ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని నోటీసులో స్పష్టం చేసింది. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీల్లోని లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చారు. ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే పదహారు ప్రాంతాల్లో మూడు వేల తొమ్మిది వందల మందికి నోటీసులు ఇచ్చినట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా గత ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది. వీటి కోసం సుమారు తొమ్మిది వేల ఒక వంద కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఇప్పటి వరకు అరవై వేల ఇళ్లు పూర్తయినట్లు తెలుస్తోంది. పూర్తయిన ఇళ్లకు పలు విడతలుగా డ్రా నిర్వహించి, లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలు పంపిణీ చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు లబ్ధిదారులు అలంకారప్రాయంగా మార్చుకున్నారు. ఎలాగో ఇల్లు వచ్చింది కదా, ఎప్పుడైనా వెళ్లొచ్చు అనే ఆలోచనతో ఇళ్లకు తాళాలు వేసి, వేరే చోట అద్దెకుంటున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా పది వేల నుంచి పదిహేను వేల ఇళ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని, వాటికి తాళాలు వేసి ఉన్నాయని అధికారుల క్షేత్రస్థాయి తనిఖీల్లో బయటపడింది. దీంతో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో ఉండకపోతే వాటిని స్వాధీనం చేసుకుంటాం అంటూ నోటీసులో చెబుతున్నారు. ప్రతాప్ సింగారం వంటి మేజర్ ప్రాజెక్ట్‌లో ఇళ్లు పొంది ఏడాది దాటినా ఖాళీగా ఉంచిన వారిని గుర్తించి తుది నోటీసులు జారీ చేశారు. నోటీసు అందిన వారు తొంభై రోజుల లోపు ఇంట్లోకి మారాలని, లేకపోతే కేటాయింపును రద్దు చేసి ఆ ఇంటిని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అర్హులైన పేదలకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
గతంలో డబుల్ ఇళ్లు పొందిన వారిలో చాలా మంది పాతబస్తీ, అంబర్‌పేట్, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి ప్రతాప్ సింగారం, కొల్లూరు వంటి శివారు ప్రాంతాల్లో ఇల్లు కేటాయించారు. దీంతో పిల్లల చదువులు దెబ్బతింటాయని, రవాణా సౌకర్యాలు లేవంటూ ఆ ఇళ్లలోకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. మరికొందరు తమకు వచ్చిన ఇంటిని ఇతరులకు అద్దె ఇవ్వడం గాని, అమ్మేయడానికి గాని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి 2024లోనే మొదటి విడత నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం జారీ చేసిన నోటీసును చివరి అవకాశంగా భావించాలని, ఇకపై ఎలాంటి కారణాలు చెప్పినా వినే ప్రసక్తే లేదని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. నోటీసుల గడువు ముగియగానే అధికారులు ఇంటింటి సర్వే చేసి, ఖాళీగా ఉన్న ఇళ్లను సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది డబుల్ ఇళ్ల కోసం అప్లై చేశారు. ఇందులో ఆరు లక్షల మంది అర్హులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా ప్రతాప్ సింగారంలో నిర్మించిన రెండు వేల ఐదు వందల ఇళ్లలో వందలాది ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ కాలనీ అయిన కొల్లూరు, రాంపల్లి, అహ్మద్‌గూడలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని అందులో ఉండని వారిని గమనించామని అధికారులు తెలిపారు. గతంలో నోటీసులు ఇస్తే చాలా మంది స్పందించలేదని చెప్పారు. మరికొందరు వివిధ కారణాలు చెప్పారన్నారు. ఇప్పుడు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదహారు ప్రాంతాల్లో మూడు వేల తొమ్మిది వందల మందికి పైగా రెండోసారి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ ఇళ్లల్లో ఉండకపోతే నెల రోజుల్లో ఇళ్లు స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు.. ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది.. తీరా ఇంట్లోకి వెళ్లి ఉండటం మాత్రం చేతకావడం లేదు. తాళం వేసి ఉంచితే ఇల్లు కాదేమో.. లాకర్ అనుకున్నట్టుంది కొందరి తీరు. పేదల కోసం కట్టిన ఇల్లు.. ఖాళీగా పెట్టుకోవడానికి కాదు. ఉండటం చేతకాకపోతే.. అవసరమైన వారికి ఇచ్చేయడం మేలు. “ఇల్లు కావాలి.. కానీ ఇల్లులో ఉండడం మాత్రం వద్దు” అంటే.. ప్రభుత్వం కూడా “ఇల్లు కావాలా.. లేక తాళం కావాలా?” అని అడగాల్సిందే.
