హైదరాబాద్ బిర్యానీకి కల్తీ భూతం.. షాదాబ్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యలు

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కలకలం రేపాయి. షాదాబ్ హోటల్ లైసెన్స్ సస్పెన్షన్, 19 కేఫ్‌ల తనిఖీలతో ఆహార నాణ్యతపై చర్చ మొదలైంది.

hyderabad-biryani-food-safety-shadab-hotel-fssai-license-suspended
hyderabad-biryani-food-safety-shadab-hotel-fssai-license-suspended

హైదరాబాద్ : హైదరాబాద్ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ బిర్యానీకి దేశవిదేశాల్లో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

హైదరాబాద్‌కు వచ్చే సెలబ్రిటీ నుంచి సామాన్యుడి వరకు.. ఒక్కసారైనా ఈ బిర్యానీ రుచి చూడాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ ఫేమ్‌ను ఫుడ్ సేఫ్టీ సమస్యలు వెంటాడుతున్నాయి.

బిర్యానీలో కుళ్లిన మాంసం, నాణ్యత లేని పదార్థాలు ఉపయోగిస్తున్న ఘటనలు గతంలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

తాజాగా హైదరాబాద్ పాతబస్తీలోని ప్రముఖ షాదాబ్ హోటల్‌పై TG SAFE Enforcement Team చర్యలు తీసుకుంది.

మదీనాలోని షాదాబ్ హోటల్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో.. పరిశుభ్రత, పారిశుధ్యం, మాంసం, ఇతర ఆహార పదార్థాల నిల్వకు సంబంధించిన పలు నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు.

తనిఖీల్లో కుళ్లిన లేదా కాలం చెల్లిన ఆహార పదార్థాలు, ఈగలు, బొద్దింకల బెడద, పరిశుభ్రత లోపాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఉల్లంఘనల నేపథ్యంలో షాదాబ్ హోటల్‌కు సంబంధించిన FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేసి, కార్యకలాపాలు నిలిపివేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.

అంతేకాదు.. TG SAFE Enforcement Teams ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని 19 కేఫ్‌లు, స్నాక్ పాయింట్లపై 9 ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ తనిఖీల్లో పలు చోట్ల ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

బాగ్ లింగంపల్లిలోని Dreamz Cafeteria, పంజాగుట్టలోని Asiatic Caféను కూడా మూసివేశారు.

కల్తీపై అనుమానంతో 15 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. పలు కేఫ్‌లకు నోటీసులు కూడా జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. తక్కువ ధరకు మటన్ పేరుతో ఇతర జంతువుల మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారన్న అనుమానాలు, నిల్వ ఉంచిన మాంసాన్ని మళ్లీ వంటకాల్లో ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా గతంలో వెలుగులోకి వచ్చాయి.

అందుకే స్లాటర్ హౌస్ నుంచి వ్యాపారి వరకు.. వ్యాపారి నుంచి హోటల్ కిచెన్ వరకు.. కిచెన్ నుంచి కస్టమర్ ప్లేట్ వరకు ప్రతి దశలోనూ పటిష్టమైన నిఘా అవసరం.

మాంసం ఎక్కడి నుంచి వస్తోంది?
దానికి సంబంధించిన బిల్లులు ఉన్నాయా?
సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తున్నారా?
ఎంతకాలం నిల్వ చేస్తున్నారు?
కిచెన్‌లో పరిశుభ్రత పాటిస్తున్నారా?

అనే అంశాలపై అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలి.

ఎందుకంటే బిర్యానీ రుచి ఎంత ముఖ్యమో.. దాని నాణ్యత, ఆహార భద్రత అంతకంటే ముఖ్యం.

హైదరాబాద్ బిర్యానీకి ఉన్న వందల ఏళ్ల ఖ్యాతిని కాపాడాలంటే కల్తీకి అడ్డుకట్ట వేయడంతో పాటు.. హోటళ్లు, రెస్టారెంట్ల కిచెన్‌లలో పరిశుభ్రతపై కూడా కఠినంగా వ్యవహరించాల్సిందే.

కిచెన్‌లో నిర్లక్ష్యానికి చెక్..
కల్తీ ఆహారానికి కళ్లెం..
కస్టమర్ ప్లేట్‌లోకి నాణ్యమైన ఆహారం చేరేలా పటిష్టమైన నిఘా..

ఇదే ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీకి, హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీకి అత్యవసరం.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »