హైదరాబాద్‌లో పార్కింగ్ కష్టాలకు చెక్ … ‘స్మార్ట్ ఆన్ స్ట్రీట్ పార్కింగ్’తో జీహెచ్‌ఎంసీ కొత్త విధానం

హైదరాబాద్‌లో వాహనదారులు ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యకు పరిష్కారంగా జీహెచ్ఎంసీ ‘స్మార్ట్ ఆన్ స్ట్రీట్ పార్కింగ్’ విధానాన్ని తీసుకొస్తోంది. మొబైల్ యాప్ ద్వారా ఖాళీ పార్కింగ్ స్లాట్లను గుర్తించి ముందుగానే బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. సెన్సర్ టెక్నాలజీతో పార్కింగ్ నిర్వహణ చేపట్టి ట్రాఫిక్ రద్దీ తగ్గించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలవుతోంది.

GHMC introduces app-based Smart On-Street Parking

నగర జీవనశైలిలో వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పార్కింగ్ సమస్య హైదరాబాద్ వాసులకు అతిపెద్ద తలనొప్పిగా మారింది. షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ సదుపాయాలు ఉన్నప్పటికీ, పబ్లిక్ ప్రదేశాల్లో వాహనాలు నిలిపేందుకు సరైన స్థలం దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్కన కార్లు, బైకులు ఆపితే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించడం లేదా టోవింగ్ వాహనాల ద్వారా తీసుకెళ్లడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు Greater Hyderabad Municipal Corporation (జీహెచ్‌ఎంసీ) ‘స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్’ ప్రాజెక్టును అమలు చేయనుంది.

ముందుగానే స్లాట్ బుకింగ్

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రత్యేక డిజిటల్ విధానాన్ని తీసుకొస్తున్నారు. వాహనదారులు సులభంగా పార్కింగ్ స్లాట్లు గుర్తించేందుకు MyGHMC Appలో ప్రత్యేక లింక్ అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా వాహనదారులు తమ పరిసరాల్లో 500 మీటర్ల పరిధిలో ఖాళీగా ఉన్న పార్కింగ్ స్లాట్ల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. అవసరమైతే నిర్ణీత రుసుం చెల్లించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.

Also Read: క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత… రాళ్ల దాడులు, లాఠీచార్జ్‌తో హై టెన్షన్

గత ఏడాది అక్టోబర్‌లో ఖైరతాబాద్ జోన్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి జోనల్ కమిషనర్ ఆసక్తి గల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించారు. టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవడంతో రెండు ప్రైవేట్ సంస్థలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రతి సంస్థకు ఏడు చొప్పున మొత్తం 14 ప్రాంతాల్లో పార్కింగ్ స్లాట్ల అభివృద్ధి పనులు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

నిరంత‌రం సెన్స‌ర్లు రికార్డ్ ..

ఈ స్మార్ట్ పార్కింగ్ విధానంలో భాగంగా రోడ్ల పక్కన ప్రత్యేక లేన్ మార్కింగ్ చేసి పార్కింగ్ స్లాట్లు గుర్తిస్తారు. ప్రతి స్లాట్‌కు ఎదురుగా సెన్సర్లు ఏర్పాటు చేస్తారు. అక్కడ వాహనం ఉందా లేదా అనే సమాచారాన్ని సెన్సర్లు నిరంతరం రికార్డ్ చేస్తాయి. ఆ డేటా నేరుగా యాప్‌లో అప్‌డేట్ అవుతుంది. దీంతో వాహనదారులు అనవసరంగా తిరగకుండా సులభంగా ఖాళీ స్థలాన్ని గుర్తించగలుగుతారు. ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్ సదుపాయాలను అమలు చేస్తున్నారు. సోమాజిగూడ, నెక్లెస్ రోడ్, బషీర్‌బాగ్, అబిడ్స్, హిమయత్‌నగర్, మెహిదీపట్నం వంటి వ్యాపార మరియు రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ స్లాట్లను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, హోటళ్లు, షాపింగ్ జోన్లు, చౌరస్తాల వద్ద ఈ సదుపాయం ఎక్కువగా అందుబాటులోకి రానుంది.

ఈ కొత్త విధానం అమలులోకి వస్తే వాహనదారులకు సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. నగర అభివృద్ధిలో భాగంగా స్మార్ట్ సిటీ లక్ష్యాలను చేరుకునే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. పార్కింగ్ సమస్యతో నిత్యం ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు ఈ ప్రాజెక్ట్ పెద్ద ఊరటనివ్వనుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »