జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి బండారం మరోసారి బట్టబయలైంది. భవన నిర్మాణ పనులకు సంబంధించి భారీగా లంచం డిమాండ్ చేసిన టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గోల్కొండ జోన్, సర్కిల్-33, మెహిదీపట్నం పరిధిలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న తులసిరాం సునీత రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో మొదటి విడతగా రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఆమెను పట్టుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 29వ తేదీన మెహిదీపట్నంలో జీ+3 నిర్మాణం చేపడుతున్న వ్యక్తుల నుంచి ఫిర్యాదు వచ్చింది. నిర్మాణానికి సంబంధించి నోటీసులు జారీ చేయగా, ఆ నోటీసులను ఇగ్నోర్ చేయడానికి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్‌ను ఇగ్నోర్ చేయడానికి తొలుత రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు.
ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. “ఆ రూ.15 లక్షలు డిమాండ్ చేశారని మనకు కంప్లెయింట్ వచ్చింది. దాన్ని మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ చేసి టు వాట్ ఎక్స్‌టెంట్ ఇట్ ఈజ్ ట్రూ అని కనుక్కోవడానికి ట్రై చేశాం. అక్కడ ఫస్ట్ నాడు రికార్డింగ్ చేసాము. ఫస్ట్ నాడు ఏమైందంటే రూ.15 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టింది. ఫర్దర్ నెగోషియేషన్స్ మీద వచ్చేసి రూ.15 లక్షలు కాకుండా రూ.8 లక్షలకు అగ్రి అయ్యారు. రూ.8 లక్షలు కూడా రెండు ఇన్‌స్టాల్‌మెంట్స్.. రూ.4 లక్షలు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, ఇంకొక రూ.4 లక్షలు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్” అని తెలిపారు.
అనంతరం ఇవాళ సాయంత్రం సుమారు 6.50 గంటల సమయంలో రూ.4 లక్షల మొదటి విడత లంచం తీసుకుంటుండగా సునీతను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు.
లంచం డిమాండ్ చేసే అధికారులపై ప్రజలు ఏసీబీకి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. “పబ్లిక్ ఈజ్ మోస్ట్ వెల్‌కమ్ టు కమ్ అండ్ లాడ్జ్ కంప్లెయింట్ విత్ ది ఏసీబీ ఆఫీషియల్స్. నో నీడ్ టు పానిక్. మీ డీటెయిల్స్ మేము వెరీ కాన్ఫిడెన్షియల్‌గా కీప్ చేస్తాం” అని చెప్పారు.
ఏసీబీని వివిధ మార్గాల్లో సంప్రదించవచ్చని తెలిపారు. మొబైల్ నంబర్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాగే 1064 టోల్‌ఫ్రీ నంబర్ కూడా ఉందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. సునీత వద్ద నుంచి లెక్కల్లో చూపని మరో రూ.2.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె ఇంటి వద్ద కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
Rs 8 lakh bribe to construct building in GHMC limits
Anti-Corruption Bureau (ACB) arrested Tulasirarn Sunitha, the Town Planning Supervisor at GHMC’s Golconda Zone in Mehdipatnam, on October 5. She was caught taking a bribe of Rs 4 lakh out of a total demand of Rs 8 lakh from a complainant.
In return, she agreed to ignore official orders, let the complainant keep building, not cause further problems, and help in the future.
The ACB found the Rs 4 lakh bribe with her and also seized Rs 2.5 lakh in extra cash.
#TelanganaACB #TelanganaACBnews #Golcondanews #GHMCcorruption #GHMCnews— Hyderabad Mail (@Hyderabad_Mail) October 5, 2026

