హైదరాబాద్: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలార్జంగ్ మ్యూజియంలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో సాలార్జంగ్ మ్యూజియం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ చరిత్ర, ముఖ్యంగా హైదరాబాద్ విమోచన ఉద్యమంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించారు.
ఈ క్విజ్ పోటీల్లో నగరంలోని దాదాపు 25 పాఠశాలలు పాల్గొన్నాయి. ప్రాథమిక దశలో 150 మందికి పైగా విద్యార్థులు పోటీ పడ్డారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన మూడు పాఠశాలలకు బహుమతులు అందించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Salar Jung Museum, in collaboration with the Ministry of Culture, Government of India, has organised an inter-school quiz on ‘the History of Hyderabad’, with a special focus on the Hyderabad Liberation Movement.
Nearly 25 schools participated, with over 150 students appearing in… pic.twitter.com/Zi2aLCUIVz
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) September 16, 2026
హైదరాబాద్ చరిత్రతో పాటు కళలపై అవగాహన
ఈ క్విజ్ పోటీల్లో హైదరాబాద్ చరిత్ర, విమోచన ఉద్యమంతో పాటు నగరంలోని మ్యూజియంలు, కళలు, సంప్రదాయ ప్రదర్శన కళలకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడిగారు. విద్యార్థులు చరిత్రను పుస్తకాలకే పరిమితం కాకుండా ఆసక్తికరమైన విధానంలో నేర్చుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్ జ్యోతి రాయ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ చరిత్ర, వారసత్వం గురించి ఉత్సాహంగా తెలుసుకుంటున్నారని తెలిపారు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా చరిత్ర, సంస్కృతిపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
రెండో స్థానంలో నిలిచిన పాఠశాల
ఈ పోటీలో పాల్గొన్న ఓ విద్యార్థి తన అనుభవాన్ని పంచుకుంటూ.. తమ పాఠశాల రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమం ఎంతో బాగుందని, అందరి ప్రదర్శన ఉత్సాహభరితంగా సాగిందని చెప్పారు. హైదరాబాద్ నిజాం పాలన, నగర అభివృద్ధి, హైదరాబాద్ విమోచన దినోత్సవ ప్రాధాన్యత వంటి అంశాలపై ఎంతో సమాచారం తెలుసుకున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ చరిత్రలో ముఖ్యమైన రోజుగా భావించే విమోచన దినోత్సవం సందర్భంగా ఇలాంటి పోటీలో పాల్గొనడం గర్వంగా ఉందని విద్యార్థి తెలిపారు.
మ్యూజియం నిర్వాహకులు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏడాది నగరంలోని వివిధ పాఠశాలలతో పాటు కేంద్ర విద్యాలయాల విద్యార్థులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు చరిత్రపై ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమం మంచి అవకాశంగా నిలుస్తోందని పేర్కొన్నారు.


