హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
ఈసారి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సుమారు వెయ్యి మంది కళాకారులతో ప్రత్యేక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు వివరించారు.
హైదరాబాద్ విమోచన పోరాటంపై ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా జరిగిన పోరాటాలు, నిజాం పాలనలో చోటుచేసుకున్న ఘటనలు, భారత సైన్యం చేసిన సాహసాలను ప్రజలకు వివరించేలా ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా హైదరాబాద్ విమోచన చరిత్రకు సంబంధించిన వర్చువల్ మ్యూజియాన్ని కూడా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వం రూపొందించిన ఈ వర్చువల్ మ్యూజియం ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉందని, కార్యక్రమం సందర్భంగా మరోసారి దాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.
సెప్టెంబర్ 17న ఉపరాష్ట్రపతి హాజరు
సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు ఉపరాష్ట్రపతి ఢిల్లీ నుంచి బయలుదేరి బేగంపేటకు చేరుకుంటారని కిషన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమం అనంతరం వర్చువల్ మ్యూజియాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారని వివరించారు.
మోదీ జన్మదిన వేడుకలు, విశ్వకర్మ జయంతి
సెప్టెంబర్ 17 తెలంగాణకు ప్రత్యేకమైన రోజని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, విశ్వకర్మ జయంతి కూడా ఉన్నాయని చెప్పారు. ఈ మూడు సందర్భాలను కలిపి దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Witnessed the Central Armed Police Forces’ dress rehearsal for the Hyderabad Liberation Day celebrations at Parade Grounds, Secunderabad, and saw their special formations and displays.
I warmly invite everyone to join us at 𝟖:𝟎𝟎 𝐀𝐌 𝐨𝐧 𝐒𝐞𝐩𝐭𝐞𝐦𝐛𝐞𝐫 𝟏𝟕, 𝟐𝟎𝟐𝟔,… pic.twitter.com/tXDmhOs0xf
— G Kishan Reddy (@kishanreddybjp) September 15, 2026
ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, విద్యాసంస్థలు, బీజేపీ, మిత్రపక్షాలు, ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రజలకు కిషన్ రెడ్డి ఆహ్వానం
సెప్టెంబర్ 17న ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి హైదరాబాద్, భాగ్యనగర్, తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కిషన్ రెడ్డి కోరారు.
అలాగే విమోచన దినోత్సవం సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి నిర్వహించనున్న హైదరాబాద్ మహిళల మోటార్‌సైకిల్ ర్యాలీకి కూడా మీడియా ప్రతినిధులు హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు.


