చారిత్రక బావికి పూర్వ వైభవం.. HYDRAA కీలక పునరుద్ధరణ పనులు

హైదరాబాద్ శివరాంపల్లిలోని చారిత్రక బామ్ రుక్న్-ఉద్-దౌలా బావి పునరుద్ధరణకు HYDRAA శ్రీకారం చుట్టింది. చెత్త, పూడిక తొలగించి బావిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

బామ్ రుక్న్-ఉద్-దౌలా బావి
బామ్ రుక్న్-ఉద్-దౌలా బావి

హైదరాబాద్ పాతనగరంలోని శివరాంపల్లిలో బామ్ రుక్న్-ఉద్-దౌలా చెరువు సమీపంలో ఉన్న చారిత్రక బావికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు HYDRAA పనులు ప్రారంభించింది. చెరువు దిగువ భాగంలో ఉన్న సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలోని ఈ పురాతన బావిని వారసత్వ పరిరక్షణ, పర్యావరణ అభివృద్ధి, ప్రజల వినియోగానికి అనుగుణంగా పునరుద్ధరిస్తున్నారు.

చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ చారిత్రక కట్టడాన్ని తిరిగి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు హైదరాబాద్‌లోని సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలన్నది ఈ పనుల ఉద్దేశమని HYDRAA తెలిపింది.

ఇటీవలే పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. మరో రెండు నుంచి మూడు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బావిలోకి గణనీయమైన స్థాయిలో నీరు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లిన పురాతన బావి

మార్చి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ధరించిన బామ్ రుక్న్-ఉద్-దౌలా చెరువును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో చెరువు పక్కనే ఉన్న చారిత్రక బావి గురించి HYDRAA కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఆ తర్వాత బావి పునరుద్ధరణ పనులు చేపట్టారు. చెరువు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థే ప్రస్తుతం ఈ చారిత్రక బావి పునరుద్ధరణ పనులను కూడా చేపడుతోంది.

నిజాం కాలంలో తాగునీటి వనరుగా..

HYDRAA వివరాల ప్రకారం, నిజాం కాలంలో బామ్ రుక్న్-ఉద్-దౌలా చెరువు, దాని దిగువన ఉన్న ఊట బావి ప్రజలకు తాగునీటిని అందించేవి. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని అప్పట్లో నమ్మేవారని అధికారులు తెలిపారు.

కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైన చెరువు ఆక్రమణలకు గురైంది. ఒకప్పుడు సుమారు 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న చెరువు క్రమంగా నాలుగు ఎకరాలకు తగ్గిపోయిందని HYDRAA పేర్కొంది. అయితే HMDA రికార్డుల్లో చెరువు విస్తీర్ణం 17 ఎకరాలుగా నమోదై ఉండటంతో ఆ వివరాల ఆధారంగా ఆక్రమణలను తొలగించి, చెరువును తవ్వి పునరుద్ధరించినట్లు తెలిపింది.

ఇప్పుడు చెరువు దిగువన ఉన్న బావి వంతు వచ్చింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, మట్టి, పూడిక, దట్టమైన వృక్షసంపద పేరుకుపోవడంతో బావి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గిపోయింది. వీటిని తొలగించి బావిని తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయి.

హైదరాబాద్ నీటి వారసత్వానికి మరో గుర్తు

హైదరాబాద్‌లో చారిత్రక ప్రాధాన్యం ఉన్న అనేక పురాతన బావులు ఉన్నాయి. వాటిలో బామ్ రుక్న్-ఉద్-దౌలా చెరువు దిగువన ఉన్న ఈ బావికి కూడా ప్రత్యేక స్థానం ఉందని HYDRAA తెలిపింది.

చారిత్రక వివరాల ప్రకారం, బామ్ రుక్న్-ఉద్-దౌలా చెరువు సుమారు 1770 ప్రాంతంలో మూడో నిజాం సికందర్ జా పాలనలో నిర్మితమైంది. అప్పటి ప్రధానమంత్రి నవాబ్ రుక్న్-ఉద్-దౌలా పేరు మీదే చెరువుకు ఆ పేరు వచ్చినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

చెరువు మొదట సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని పేర్కొంటున్నారు. చెరువు కట్ట ద్వారా నీరు సహజంగా వడపోతకు గురై, చుట్టుపక్కల పెరిగే ఔషధ మొక్కల ప్రభావంతో బావిలోకి చేరేదని చారిత్రక కథనాలు చెబుతున్నాయి. దీంతో ఆ నీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండేదని పేర్కొంటున్నారు.

లండన్‌కు కూడా నీరు వెళ్లిందా?

ఆ కాలంలో ఈ బావి నీటిని ఎడ్లబండ్ల ద్వారా దూర ప్రాంతాలకు తరలించేవారని, చివరకు లండన్‌కు కూడా ఈ నీరు చేరినట్లు చారిత్రక కథనాల్లో ప్రస్తావన ఉందని HYDRAA తెలిపింది.

చెరువులో ఔషధ మొక్కల కొమ్మలు, బెరడు, పూలను ఉంచేవారని, వాటి ద్వారా వడపోతకు గురైన నీరు దిగువనున్న ఊట బావికి చేరేదని ఆ కథనాలు పేర్కొంటున్నాయి.

చెరువు, ఔషధ మొక్కలు, పురాతన బావి.. ఈ మూడింటి సమన్వయం హైదరాబాద్‌లో గతంలో అమలైన నీటి సంరక్షణ పద్ధతులు, సహజ వడపోత విధానాలు, ప్రకృతి ఆధారిత వైద్య పరిజ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయని HYDRAA పేర్కొంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »