ప్రభుత్వాలు తీసుకునే అనాలోచిత నిర్ణయాలకు కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన పనులే ఉదాహరణ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ టన్నెల్స్ నిర్మించేందుకు పెద్ద ఎత్తున పనులు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆ మొత్తం ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను నరికేశారు. పలుచోట్ల తవ్వకాలు చేపట్టారు. ట్రాఫిక్‌ను వన్‌వే చేశారు. ఇప్పుడు ప్రాజెక్టును రద్దు చేసి కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్లను ఎందుకు నరికారని కూడా ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చెట్లు నరకవద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించారు. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ రాత్రిపూట కూడా పనులు కొనసాగించారని విమర్శలు వచ్చాయి.
ఇప్పుడు ప్లాన్ ఎందుకు మార్చారు?
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ టన్నెల్స్ నిర్మించాలనే ప్రణాళికను ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టి.. పంజాగుట్ట సర్కిల్ నుంచి ముగ్ధ జంక్షన్ మీదుగా కేబీఆర్ పార్క్ జంక్షన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల పొడవున ఒకే ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు చెబుతున్నారు.
అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్ టన్నెల్స్ ఉండవు. మరి ఇంతకుముందు కేబీఆర్ పార్క్ చుట్టూ మార్కింగ్ చేసి, అక్కడి సెలబ్రిటీలు తమ ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుందని చెప్పిన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ వచ్చే ఫ్లైఓవర్లు, అండర్ టన్నెల్స్‌తో హైదరాబాద్ దశ, దిశ మారిపోతుందని, నగర చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆ డిజైన్లు, ఆ ప్రణాళికలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
వన్‌వేతోనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమైందా?
ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానాన్ని అమలు చేశారు. అయితే ఈ వన్‌వే విధానం సక్సెస్ కావడంతో ప్రస్తుతం ట్రాఫిక్ జామ్‌లు తగ్గాయని చెబుతున్నారు.
కొన్ని కిలోమీటర్లు ఎక్కువగా తిరగాల్సి వచ్చినా వాహనదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నారని, గతంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ వద్ద ఉండే ట్రాఫిక్ జామ్‌లు ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఎప్పుడూ వాహనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు వన్‌వే విధానం తర్వాత ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని చెబుతున్నారు.
అలాంటప్పుడు ఈ ఆలోచన ముందే ఎందుకు రాలేదనే ప్రశ్న తలెత్తుతోంది. ముందుగా వన్‌వే విధానాన్ని ట్రయల్‌గా అమలు చేసి, ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చిందా లేదా పరిశీలించిన తర్వాత అవసరమైతే టెండర్లు పిలిచి ఫ్లైఓవర్లు, అండర్ టన్నెల్స్ నిర్మాణం చేపట్టవచ్చని అంటున్నారు.
KBR పార్క్ చుట్టూ ఫ్లైవర్, అండర్ పాస్ ల పేరిట కోట్ల రూపాయల ఖర్చు, చెట్ల నరికివేత, రోడ్ల తవ్వకాలు… తీరా ఇప్పుడు వన్-వేతో ట్రాఫిక్ తగ్గిందని వాటిని వద్దంటున్నారు.
నిజమైన పాలనకు ముందుచూపు అవసరం. ప్రజాధనం, ప్రకృతి వనరులను ఇలా వృథా చేయడం సమర్థనీయం కాదు రేవంత్ గారు.
@BJP4Telangana @N_RamchanderRao
#KBRPark #Hyderabad #RevanthReddy #CongressFailedTelangana #BJP4Telangana
— NV Subhash (@nvsubhash4bjp) October 6, 2026
రూ.1,096 కోట్ల టెండర్.. ఇప్పుడు కాంట్రాక్ట్ పరిస్థితి ఏంటి?
ఈ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు రూ.1,096 కోట్లతో టెండర్లు పిలిచినట్లు చెబుతున్నారు. హెచ్‌సీటీ ప్రాజెక్టు కింద ఈ పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ EPC (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు.
ఇప్పుడు ప్రాజెక్టు రద్దు నేపథ్యంలో ప్రస్తుత కాంట్రాక్టర్‌ను టెర్మినేట్ చేసి, ఇప్పటివరకు చేసిన పనులకు చెల్లింపులు చేయాలా? లేక ఇదే సంస్థకు కొత్తగా ప్రతిపాదించిన ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ పనులను అప్పగించాలా? అనే అంశంపై స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.
అయితే ఇప్పటికే నరికిన చెట్ల పరిస్థితి ఏంటి? తవ్విన గోతులను మళ్లీ పూడ్చేస్తారా? ప్రజల డబ్బుతో జరిగిన ఈ పనుల వల్ల జరిగిన నష్టానికి బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ముందుగా వన్‌వే విధానాన్ని అమలు చేసి ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించి ఉంటే, ఇంత పెద్ద ప్రాజెక్టు అవసరం ఉందా లేదా అన్నది అప్పుడే తేలిపోయేదని పలువురు అంటున్నారు. ఇప్పుడు ప్రణాళిక మార్చడంతో ఇప్పటికే చేసిన పనులు, ఖర్చు చేసిన ప్రజాధనం, నరికిన చెట్ల పరిస్థితిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రశ్నిస్తున్నారు.


