Saddula Bathukamma: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు!

Saddula Bathukamma: హైదరాబాద్‌లో సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల దారి మళ్లింపులు.

Saddula Bathukamma
Saddula Bathukamma

Saddula Bathukamma: సద్దుల బతుకమ్మ సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వేళ పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నారు. వేడుకలు పూర్తయిన తర్వాత పరిస్థితిని బట్టి ఆంక్షలను తొలగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాంక్‌బండ్ వైపు సాధారణ వాహనాలకు నో ఎంట్రీ

తెలంగాణ తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు సాధారణ వాహనాలను అనుమతించరు. ఇక్బాల్ మినార్ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, డీపీఆర్ మిల్స్, ఇందిరా పార్క్ మీదుగా మళ్లించనున్నారు.

ఖైరతాబాద్ వీవీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నెక్లెస్ రోటరీ, ప్రసాద్ ఐమ్యాక్స్, మింట్ కాంపౌండ్ వైపు దారి మళ్లిస్తారు.

పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

నల్లగుట్ట, లిబర్టీ, సికింద్రాబాద్, ముషీరాబాద్, కవాడిగూడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్యాంక్‌బండ్, కవాడిగూడ, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్టతో పాటు ఖైరతాబాద్ వీవీ విగ్రహం, సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, తెలంగాణ తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, లిబర్టీ, రవీంద్రభారతి, అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో భారీ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక డైవర్షన్

సికింద్రాబాద్ నుంచి ఎంజీబీఎస్‌కు వెళ్లే అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకార్ ఉపకార్ జంక్షన్ నుంచి వైడబ్ల్యూసీఏ, సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట, బర్కత్‌పురా, చార్మినార్ ఘాట్ మీదుగా మళ్లించనున్నారు.

నగర సిటీ బస్సులను కర్బలా మైదాన్ నుంచి బైబిల్ హౌస్, కవాడిగూడ, గాంధీనగర్, ధోబీఘాట్, ఇందిరాపార్క్, కట్ట మైసమ్మ మీదుగా పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు.

సైబరాబాద్ పరిధిలోనూ ట్రాఫిక్ ఆంక్షలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి ఐడియల్ చెరువాడ ప్రాంతంలోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

హైటెక్ సిటీ, మాదాపూర్, హఫీజ్‌పేట్, కూకట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలను లక్కీ రెస్టారెంట్ సిగ్నల్ నుంచి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్, రెయిన్‌బో విస్టా, ఎంజే నగర్ ఎక్స్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు.

నిర్దేశించిన ప్రాంతాల్లోనే పార్కింగ్

వేడుకలకు వచ్చే ప్రజలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే తమ వాహనాలను నిలిపివేయాలని అధికారులు సూచించారు.

అమరవీరుల స్మారక స్థూపం, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్స్, హెచ్‌ఎండీఏ గ్రౌండ్, లుంబినీ పార్క్, బీఆర్‌కే భవన్ రోడ్ పరిసరాల్లో సూచించిన పార్కింగ్ ప్రదేశాలను ఉపయోగించాలని కోరారు.

భారీ భద్రతా ఏర్పాట్లు

సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద స్టేజీలు, స్క్రీన్లు, లైటింగ్, డీజే సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో పలు ప్రాంతాల్లో బతుకమ్మలను కూడా సిద్ధం చేస్తున్నారు.

వేడుకలకు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు.

ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి

వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు. వేడుకలు ముగిసిన అనంతరం పరిస్థితిని బట్టి ట్రాఫిక్ ఆంక్షలను తొలగిస్తామని తెలిపారు.

ట్రాఫిక్ ఆంక్షలు, మార్గాల మళ్లింపులకు సంబంధించి తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమాచారం కోసం 9010203626 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »