వయసు అడ్డుకాదంటున్న కొత్త ట్రెండ్‌.. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ‘గ్రే మ్యారేజెస్’..

అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ‘గ్రే మ్యారేజెస్’ (Grey Marriages)గా పిలుస్తున్న ఈ కొత్త సామాజిక ధోరణి వృద్ధాప్యంలో ఒంటరితనానికి తోడుగా నిలుస్తూ, కొత్త జీవితానికి మార్గం చూపుతోంది.

Grey Marriages | గతంలో పెళ్లి అంటే యువతీ యువకుల జీవితంలోనే మైలురాయిగా భావించేవారు. ఇరవైల్లోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టడం సహజంగా కనిపించేది. కానీ సమాజ దృక్పథం మారుతున్న కొద్దీ ఆ నిర్వచనమే మారిపోతోంది. అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా జీవిత భాగస్వామిని ఎంచుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కొత్త సోషల్‌ ట్రెండ్‌ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ‘గ్రే మ్యారేజెస్’ (Grey Marriages)గా పిలుస్తున్నారు. జుట్టు నెరిసిన వయసులో జరిగే ఈ వివాహాలు కేవలం పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. భారత్‌లోనూ పెద్దవయసులో పెళ్లి చేసుకునే కేసులు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆయుర్దాయం, మెరుగైన ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛపై పెరుగుతున్న అవగాహన ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వయసు పెరిగినా జీవితాన్ని ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదన్న భావన బలపడుతోంది.

తోడు కోసం..

ఈ తరహా వివాహాల వెనుక ప్రధానంగా కనిపించేది ఒంటరితనమే. పిల్లలు ఉద్యోగాలు, చదువుల కోసం దూర ప్రాంతాల్లో స్థిరపడిపోవడం, జీవిత భాగస్వామిని కోల్పోవడం వంటి పరిస్థితుల్లో చాలామంది వృద్ధులు భావోద్వేగ ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. అలాంటి సమయంలో ఒక తోడు ఉండాలనే ఆలోచన బలపడుతోంది. మానసికంగా పరస్పర మద్దతు, రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనుల్లో సహాయం, అనారోగ్య సమయంలో అండగా నిలిచే వ్యక్తి ఉండటం జీవన నాణ్యతను పెంచుతుందని చాలా మంది భావిస్తున్నారు. జీవిత చివరి దశలో కూడా ప్రేమ, ఆప్యాయత, గౌరవంతో జీవించాలన్న ఆశ ఈ పెళ్లిళ్లకు బలం ఇస్తోంది. ఇది మొదట పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఈ ట్రెండ్‌ కనిపించేది. ఇప్పుడు భారత సమాజంలోనూ క్రమంగా పెరుగుతోంది. నగర ప్రాంతాల్లో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వృద్ధులు ఈ దిశగా అడుగులు వేస్తున్న ఉదాహరణలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా, వృద్ధుల కమ్యూనిటీ గ్రూపులు కూడా ఈ పరిచయాలకు వేదికగా మారుతున్నాయి. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డెమోగ్రాఫిక్ మార్పులు, వృద్ధుల సంఖ్య పెరగడం, కుటుంబం చిన్నగా మారడం కూడా ఈ ట్రెండ్‌కు ఊతమిస్తున్నాయి. కొంతమంది నిపుణులు సిల్వర్‌ రిలేషన్‌షిప్‌ ట్రెండ్‌గా అభివర్ణిస్తున్నారు.

సవాళ్లు తక్కువేం కాదు..

ఈ కొత్త జీవితానికి అడుగుపెడుతున్న వారికి సవాళ్లు కూడా ఏమీ తక్కువగా లేవు. ముఖ్యంగా పెద్దవయసులో ఉన్న పిల్లల నుంచి అంగీకరాం పొందడం చాలా సందర్భాల్లో కష్టమవుతోంది. కుటుంబాల మధ్య భావోద్వేగ ఘర్షణలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆస్తి హక్కులు, వారసత్వం, పెన్షన్, బీమా వంటి ఆర్థిక చట్టపరమైన అంశాలు ఈ వివాహాల్లో అత్యంత కీలకంగా మారుతున్నాయి. సరైన స్పష్టత లేకపోతే భవిష్యత్తులో వివాదాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చాలా మంది ముందుగానే న్యాయ సలహాలు తీసుకుంటూ, ఆస్తి పంపకాలకు సంబంధించిన డాక్యుమెంట్లను క్లియర్‌గా సిద్ధం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఈ చిక్కులను తప్పించుకునేందుకు పెళ్లి బదులుగా సహజీవనాన్ని (Live in Arrangement) ఎంచుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు అరవై ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి అంటే ఆశ్చర్యంగా చూసే సమాజం ఇప్పుడు కొత్తగా ఆ ఆలోచనను అంగీకరిస్తోంది. వ్యక్తిగత సంతోషం, మానసిక ప్రశాంతత వయసుతో సంబంధం లేకుండా అందరికీ అవసరమనే భావన బలపడుతోంది. సవాళ్లు ఉన్నప్పటికీ, వృద్ధాప్యంలో ఒంటరితనానికి ఒక పరిష్కారంగా, కొత్త జీవితానికి మరో అవకాశంగా ‘గ్రే మ్యారేజెస్’ నిలుస్తోంది. సమాజం ఈ మార్పును ఎంత వేగంగా అంగీకరిస్తుందో అన్నదే రాబోయే రోజుల్లో తేలనుంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »