ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి ఒక అమాయక ప్రాణాన్ని బలిగొంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్‌నే సాంకేతిక లోపాలతో యమపాశంగా మారిన హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. అంబులెన్స్ తలుపులు తెరుచుకోకపోవడంతో ఓ వృద్ధుడు లోపలే చిక్కుకుపోయి, చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ప్రభుత్వ వైద్య సేవల పనితీరుపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
సత్నా జిల్లా రామ్‌నగర్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల రామ్ ప్రసాద్ శనివారం ఉదయం చలితో వణుకుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొని మెరుగైన చికిత్స కోసం సత్నా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.దీంతో రామ్ ప్రసాద్‌ను ప్రభుత్వ అంబులెన్స్‌లో సత్నాకు తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అసలు కథ మొదలైంది.
Also Read: బండ్ల గణేశ్ ఆరోగ్యంపై నారా లోకేశ్ ఆరా… ఫోన్‌లో పరామర్శ, సంకల్ప యాత్రకు మద్దతు
తెరచుకోని డోర్స్..
రోగిని బయటకు తీసేందుకు అంబులెన్స్ వెనుక తలుపులు తెరిచే ప్రయత్నం
డ్రైవర్‌తో పాటు అక్కడున్న సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించినా తెరుచుకోని డోర్స్
తలుపులు పూర్తిగా జామ్
చివరకు ఒక వ్యక్తి కిటికీ గుండా లోపలికి ప్రవేశించి లోపల నుంచి తలుపులను బలంగా తన్నాడు.
దాదాపు అరగంట పాటు రామ్ ప్రసాద్ అంబులెన్స్‌లోనే నరకయాతన అనుభవించారు.
చివరకు తలుపులు తెరుచుకున్న వెంటనే ఆయనను స్ట్రెచర్‌పై డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే రామ్ ప్రసాద్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సకాలంలో అంబులెన్స్ తలుపులు తెరుచుకుని ఉంటే తమ తండ్రి ప్రాణాలు దక్కేవని మృతుడి కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
స్థానికులు ఆగ్రహం..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
ప్రభుత్వ వైద్య సేవలపై తీవ్ర స్థాయిలో విమర్శలు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. సత్నా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, అంబులెన్స్ నిర్వహణలో లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ ఇచ్చారు.
ఈ విషాద ఘటన ప్రభుత్వ వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలు, అత్యవసర వైద్య సేవల నిర్వహణలో అధికారుల అలసత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.