దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు వాహనదారులే ప్రధాన టార్గెట్‌గా మారుతున్నారు. “ఇందుగలదందు లేడను సందేహము లేదు” అన్నట్టుగా సైబర్ ముఠాలు ప్రతిచోటా తమ తాడాఖా చూపిస్తున్నాయి. గత 40 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా సుమారు రూ.30 లక్షల మేర వాహనదారులు నకిలీ ఫాస్టాగ్ వెబ్‌సైట్ల వలన మోసపోయినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. చిన్న అవకాశమొచ్చినా సైబర్ నేరస్తులు చెలరేగిపోతున్నారని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
నకిలీ వెబ్ సైట్స్‌తో..
హైవేలపై ప్రయాణించే వ్యక్తిగత వాహనాలకు టోల్ ఫీజుల చెల్లింపును సులభతరం చేయడానికి కేంద్ర రహదారుల శాఖ ఫాస్టాగ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుంచి దీనిని కచ్చితంగా అమలు చేస్తూ వస్తోంది. దీంతో వాహనదారులు ఆన్‌లైన్ ద్వారా ఫాస్టాగ్ కొనుగోలు చేయడం పెరిగింది. ఇదే అవకాశంగా మార్చుకున్న సైబర్ ముఠాలు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, అవి ప్రభుత్వ అధికారిక సైట్లలా కనిపించేలా డిజైన్ చేస్తున్నారు.
Also Read: “కాంగ్రెస్‌లో ఉండాలా?”… జగిత్యాలలో ఏమి జరుగుతోంది? జీవన్ రెడ్డి బహిరంగ అసంతృప్తి
ఈ నకిలీ సైట్లను క్లిక్ చేసిన వెంటనే వినియోగదారుల నుంచి ఫోన్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతున్నారు. అనంతరం పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించిన డబ్బు నేరుగా మోసగాళ్ల ఖాతాల్లోకి చేరుతోంది. ఇలా దేశవ్యాప్తంగా వేలాది మంది వాహనదారులు మోసపోయినట్టు కేంద్రం వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండాలి..
ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా( National Highways Authority of India )అప్రమత్తమైంది. ఫాస్టాగ్ కొనుగోలు చేసే సమయంలో కేవలం అధికారిక వెబ్‌సైట్లు, గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా అధీకృత ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. ఫాస్టాగ్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించింది.
అధికారుల మాటల్లో చెప్పాలంటే ఒక రోజు ఆలస్యం అయినా పరవాలేదు కానీ నిర్దేశిత అధికారిక సైట్ నుంచే ఫాస్టాగ్ కొనుగోలు చేయడం ఉత్తమం. లేకపోతే క్షణాల్లోనే డబ్బు పోయే ప్రమాదం ఉంది. “మోసానికి కాదేదీ అనర్హం” అన్నట్టుగా పేట్రేగుతున్న సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రతి వాహనదారుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.