ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌.. త్వరలోనే వాట్సాప్‌ సేవలు షురూ..!

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇకపై వాట్సాప్‌ (WhatsApp Services) ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌, క్లెయిమ్‌ వివరాలు, లావాదేవీల సమాచారం సులభంగా పొందొచ్చు. యూఏఎన్‌ (UAN)తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ద్వారా ఈ సేవలు పనిచేయనున్నాయి. యూపీఐ (UPI PF Withdrawal) ద్వారా పీఎఫ్‌ డబ్బులు ఉపసంహరించుకునే సదుపాయాన్ని పరిచయం చేయబోతోంది.

EPFO | ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలోనే మరింత సులభమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తన సేవలను డిజిటల్‌గా విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీఎఫ్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం వాట్సాప్ ద్వారానే పొందే అవకాశం కల్పించబోతున్నది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ వేదిక ద్వారా సేవలు అందిస్తే సభ్యులకు మరింత చేరువ కావచ్చని కేంద్ర కార్మిక శాఖ భావిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ కొత్త వ్యవస్థలో పీఎఫ్ బ్యాలెన్స్‌, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్థితి, ఖాతా వివరాలు వంటి సమాచారం వాట్సాప్‌లోనే తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌ఓ అధికారిక గ్రీన్ టిక్ ఉన్న వాట్సాప్ నంబర్‌కు ‘హలో’ అని మెసేజ్ పంపితే సరిపోతుంది. అనంతరం ఆటోమేటెడ్ విధానంలో అవసరమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.

Read Also : బంగారం కొనుగోలుదారులకు షాక్‌..! దిగుమతులపై సుంకం 15 శాతానికి పెంపు..!

మొబైల్‌ నంబర్‌తోనే..

యూఏఎన్‌ (UAN)తో లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే ఈ సేవలు పనిచేస్తాయి. దీంతో సభ్యుల సమాచారం భద్రంగా ఉండడంతో పాటు మోసాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ సేవలు ఉద్యోగులకు ఉపయోగకరంగా మారనున్నాయి. ఈ వాట్సాప్ సేవలు పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో ఉండనున్నాయి. రోజులో ఎప్పుడైనా సభ్యులు తమ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు పీఎఫ్ వివరాల కోసం వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడం, కార్యాలయాలను సంప్రదించడం వంటి ఇబ్బందులు ఉండేవి. కొత్త విధానం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది. అంతేకాకుండా సభ్యులకు అవసరమైన అలర్ట్స్‌, నోటిఫికేషన్లు, అప్‌డేట్స్‌ సైతం స్థానిక భాషల్లో అందించేందుకు ఈపీఎఫ్‌ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీంతో ఇంగ్లిష్ పరిజ్ఞానం తక్కువగా ఉన్న ఉద్యోగులు సైతం సులభంగా సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Read Also : Gold Price | మోదీ పిలుపు.. ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో తగ్గిన బంగారం కొనుగోళ్లు..!

యూపీఐతో పీఎఫ్ ఉపసంహరణకు సన్నాహాలు

మరో కీలక నిర్ణయంగా యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకునే సౌకర్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే బ్యాంక్‌ బ్రాంచ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది. యూపీఐ పిన్‌ ఆధారంగా లావాదేవీలు నిర్వహించే విధంగా కొత్త విధానం ఉండనుంది. పీఎఫ్ క్లెయిమ్ ఆమోదం అనంతరం డబ్బు నేరుగా ఖాతాలో జమ అవుతుంది. ఆ మొత్తాన్ని ఏటీఎం ద్వారా లేదా యూపీఐ యాప్‌ల ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దాంతో అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు వేగంగా డబ్బు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓ సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు, ఫ్యాక్టరీ కార్మికులు, చిన్న సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. కొత్త డిజిటల్ సేవలతో కార్యాలయాలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, సభ్యులకు సమయం ఆదా అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో ఇది మరో ముందడుగుగా భావిస్తున్నారు.

Read Also : ఏపీలో విస్తరణపై ఉబెర్ దృష్టి.. సీఎం చంద్రబాబుతో గ్లోబల్ సీఈఓ భేటీ..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »