బంగారం కొనుగోలుదారులకు షాక్‌..! దిగుమతులపై సుంకం 15 శాతానికి పెంపు..!

బంగారం (Gold), వెండి (Silver) దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) సుంకాన్ని (Import Duty) 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు వాణిజ్య లోటును నియంత్రించడమే లక్ష్యంగా భావిస్తున్నారు. అయితే, ఈ నిర్ణయంతో బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉండగా.. ధరలపై మరింత ఒత్తిడి పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Gold and Sliver Today
Gold and Sliver Today

Gold-Silver | బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని 15 శాతానికి పెంచింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం మార్కెట్లపై వెంటనే ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశమైన భారత్‌లో ఈ చర్య డిమాండ్‌ను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వాణిజ్య లోటును కంట్రోల్ చేయడానికి, రూపాయి స్థిరత్వానికి ఇది కొంత మద్దతు ఇవ్వొచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీతో పాటు 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను అమలు చేసింది. దీంతో మొత్తం ప్రభావిత సుంకం 6 శాతం నుంచి 15 శాతానికి చేరినట్లైంది.

Read Also : థ్యాంక్స్‌ సీఎం రేవంత్‌..! సీఎం రేవంత్‌ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్‌ పాలాభిషేకం..!

మరింత ఒత్తిడి పడే ఛాన్స్‌

ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ, ఈ చర్య ప్రస్తుత అకౌంట్‌ లోటును నియంత్రించడానికే తీసుకున్నట్టుగా కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికే బంగారం, వెండి ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పెంపు డిమాండ్‌పై మరింత ఒత్తిడి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలు కూడా మరోసారి చర్చలోకి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ఆయన సూచించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్‌ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!

స్మగ్లింగ్‌ పెరుగుతుందన్న ఆందోళనలు..

అధిక సుంకాల కారణంగా బంగారం స్మగ్లింగ్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2024 మధ్యలో సుంకాలు తగ్గిన తర్వాత అక్రమ రవాణా కొంత తగ్గిందని, కానీ ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అధిక ధరలు, పెరిగిన సుంకాలు కలిసి అక్రమ మార్గాలకు ప్రోత్సాహం ఇస్తాయని ముంబయి బులియన్ వ్యాపారులు అంటున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం బంగారం దిగుమతులను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలతో దిగుమతులు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయి. 3 శాతం జీఎస్టీ అమలుతో బ్యాంకులు కూడా కొంతకాలం దిగుమతులను నిలిపివేశాయి. ఫలితంగా ఏప్రిల్‌లో దిగుమతులు గత 30 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. తాజా సుంకాల పెంపుతో దిగుమతులు ఇంకా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో సాధారణ గోల్డ్ కొనుగోలుదారులపై ధరల రూపంలో అదనపు భారం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »