Gold Price | మోదీ పిలుపు.. ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో తగ్గిన బంగారం కొనుగోళ్లు..!

Gold | గోల్డ్ కొనొద్దన్న ప్రధాని మోదీ (PM Modi) పిలుపుతో ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌ (Bullion Market)లో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ధరలు తగ్గుతాయన్న అంచనాలతో చాలామంది కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

Gold Price | ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో ప్రభావం పడుతున్నది. గత రెండురోజుల్లో ఢిల్లీలోని పలు ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్లు తగ్గినట్లుగా మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. వినియోగదారుల్లో అయోమయానికి గురవుతుండగా.. వ్యాపారవర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవున్నాయి. విదేశీ మారకద్రవ్యం నిల్వలను ఆదా చేయాల్సిన అవసరం ఉందని, బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రకటన తర్వాత పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారు సైతం వాయిదా వేసుకుంటున్నారని ఢిల్లీకి చెందిన జువెలరీ వ్యాపారులు చెబుతున్నారు.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

ధర తగ్గుతుందా?

అయితే, మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పడిపోయే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అయితే, భారీగా ధరలు పడిపోయేది మాత్రం తక్కువేనని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత ఏడాది దీపావళి నుంచి మార్చి వరకు బంగారం ధరలు భారీగా పెరిగాయని, ఆ తర్వాత మార్కెట్‌లో ఇప్పటికే దాదాపు 25 శాతం వరకు తగ్గాయని పేర్కొంటున్నారు. వ్యవసాయ సీజన్‌ సైతం గోల్డ్‌ మార్కెట్‌పై ప్రభావం పడుతోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. హోలీ నుంచి వర్షాకాలం వరకు రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారని, పంట అమ్మకాల తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని గుర్తు చేస్తున్నారు. మరోవైపు, గోల్డ్‌ ఇన్‌స్టాల్‌మెంట్ పథకాల్లో డబ్బులు జమ చేయడానికీ చాలామంది వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మార్కెట్‌లో అనిశ్చితి పెరగడంతో చిన్న వ్యాపారులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని జువెలరీ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో బులియన్ వ్యాపారంపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read Also : అనుకున్న సమయానికి నైరుతి ఆగమనం.. 25 నుంచి 27 మధ్య కేరళను తాకే ఛాన్స్‌..!

దేశంలో ఉత్పత్తి జరిగేది రెండు టన్నులే..

ప్రస్తుతం మార్కెట్ మళ్లీ సాధారణ స్థితికి చేరాలని వ్యాపారులు ఎదురుచూస్తున్నారు. అవసరానికి మించి బంగారం కొనకుండా ఉండాలని పలువురు వినియోగదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో బంగారం పాత్రపై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఇండియా గోల్డ్‌ పాలసీ సెంటర్‌ చీఫ్‌ ప్రొఫెసర్‌ సుందరవల్లి ప్రకారం.. భారత్ ప్రతి ఏడాది సుమారు 600 నుంచి 700 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అయితే, దేశీయంగా ఉత్పత్తి మాత్రం ఒకటి నుంచి రెండు టన్నులకే పరిమితమవుతోంది. దేశంలోని కుటుంబాల వద్ద సుమారు 25 వేల నుంచి 27 వేల టన్నుల వరకు బంగారం నిల్వ ఉందని అంచనా వేస్తున్నారు. దేశీయ అవసరాలకు బంగారం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోందని, డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువపై ప్రభావం పడుతోందని ప్రొఫెసర్ సుందరవల్లి వివరించారు.

Read Also : బల పరీక్షలో నెగ్గిన విజయ్‌ ప్రభుత్వం.. జ్యోతిష్యుడిని ఓఎస్‌డీగా నియమించడంపై ఆగ్రహం..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »