మూడోసారి పెరిగిన పెట్రోల్‌ ధర.. ఈ సారి ఎంత పెంచారంటే..?

దేశంలో పెట్రోల్‌ ధరలు (Petrol Prices), డీజిల్‌ ధరలు (Diesel Prices) మరోసారి పెరిగాయి. గత 10 రోజుల్లో మూడోసారి ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోంది. ముడి చమురు ధరలు (Crude Oil Prices), ద్రవ్యోల్బణం (Inflation), రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Petrol Price Hike | దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. గత 10 రోజుల్లో ఇది మూడోసారి ఇంధన ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల్లో పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తాజా పెంపు మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.51కి చేరగా, డీజిల్‌ ధర రూ.92.49కు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.110.64, డీజిల్‌ రూ.97.02 ఉండగా.. ముంబయిలో పెట్రోల్‌ రూ.108.49, డీజిల్‌ రూ.95.02కు చేరుకుంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.31 కాగా, డీజిల్‌ రూ.96.98గా ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.74, డీజిల్‌ 100.88కి పెరిగింది.

Read Also : బెజవాడ లులూ మాల్‌కు హైకోర్టులో బ్రేక్: ఆర్టీసీ భూముల కేటాయింపుపై కూటమి సర్కార్ వెనక్కి!

పది రోజుల్లో ఎంత పెరిగిందంటే..?

గత 10 రోజుల్లో ఇంధన ధరలు మూడుసార్లు పెరిగాయి. తొలుత మే 15న లీటర్‌కు ఏకంగా రూ.3 పెంచగా, ఆ తర్వాత మే 19న సుమారు 90 పైసలు పెరిగాయి. తాజాగా శనివారం మరోసారి పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచారు. మొత్తంగా ఈ మూడు విడతల్లో పెట్రోల్‌పై దాదాపు రూ.4.80 నుంచి రూ.5 వరకు, డీజిల్‌పై కూడా సుమారు రూ.5 వరకు భారం పెరిగింది.

Read Also : వైజాగ్ వైపు గూగుల్ చూపు: రూ. 1.25 లక్షల కోట్ల డేటా సెంటర్! మరోవైపు రిషికొండ ‘రాజ’ సౌధంపై రగడ

చమురు ధరల పెరుగుదలే కారణమనంటున్న కంపెనీలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వరుసగా పెరుగుతుండటమే తాజా పెంపులకు ప్రధాన కారణమని చమురు సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నాయి. భారీగా ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్‌లాంటి దేశాలపై ఈ ప్రభావం నేరుగా పడుతోంది. ఇంధన ధరల పెరుగుదలతో సాధారణ ప్రజల ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రక్కులు, బస్సులు, సరుకు రవాణా ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. దాని ప్రభావం కూరగాయలు, పండ్లు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన వంటగ్యాస్‌, విద్యుత్‌ ఛార్జీలు, నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు తాజా ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారింది. ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Read Also : మహిళలను కించపరిస్తే సహించం: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »