ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు మంత్రం..! కాన్వాయ్‌లో వాహనాల తగ్గింపు..!

ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) కాన్వాయ్‌ (Convoy)లో వాహనాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దేశ ప్రజలకు పెట్రోల్‌, డీజిల్‌ వాడాకాన్ని తగ్గించాలని, అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం సూచనలు ఇవ్వడమే కాకుండా ప్రధాని స్వయంగా పొదుపు చర్యలు అమల్లోకి తేవడం చర్చనీయాంశమైంది.

PM Modi | మధ్యప్రాచ్యంలో ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భారత్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పొదుపు చర్యలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన పొదుపు, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అవసరం లేని ఖర్చులను నియంత్రించుకోవాలని, బంగారం కొనుగోళ్లను కూడా తాత్కాలికంగా తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని దేశ ప్రజలకు చెప్పడానికి పరిమితం కాకుండా స్వయంగా పొదుపు చర్యలు చేపట్టారు. అధికారిక కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నారు. భద్రతా ప్రమాణాలు (SPG) కొనసాగిస్తూనే.. కాన్వాయ్‌ను సుమారు 50 శాతం వరకు కుదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Read Also :రైతులకు కేంద్రం సంచలన పథకం — నెలకు లక్షల ఆదాయం, 60% సబ్సిడీతో సోలార్ పంప్‌సెట్లు, ఇప్పుడే అప్లై చేయండి!

ఇటీవల జరిగిన దేశీయ పర్యటనల తర్వాత ఈ విధానం మరింత వేగంగా అమలులోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమాల తర్వాత ఈ మార్పులు స్పష్టంగా కనిపించాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అదే విధంగా గుజరాత్‌, అసోం పర్యటనల్లో కూడా ఇదే విధానం కొనసాగినట్లు తెలిపాయి. కాన్వాయ్‌లో సాధ్యమైన చోట ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రధాని సూచించినట్టు సమాచారం. అయితే, ఇందుకోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని, ఉన్న వనరులనే సమర్థంగా వినియోగించాలని స్పష్టం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే తరహాలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఖర్చు తగ్గింపు చర్యలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Read Also : వెస్ట్ ఆసియా టెన్షన్ మధ్య భారత్ సేఫ్… ఎనర్జీ భద్రతపై మోడీ స్ట్రాటజీ!

కేంద్ర వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ఎరువుల ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నప్పటికీ, దేశంలో ప్రజలపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏడాది పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించినట్లుగా గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత ప్రయాణాలను తగ్గించుకోవాలని, ఇంధన వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారన్నారు. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు, విలాస ఖర్చులను నియంత్రించాలని ప్రధాని సూచించారని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం జాతీయ బాధ్యతగా భావించాలని ప్రధాని అన్నట్లుగా తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రజా రవాణా వినియోగాన్ని పెంచాలని, సరుకు రవాణాకు రైల్వే సేవలను ఎక్కువగా ఉపయోగించాలని సూచనలు ఉన్నాయి. అలాగే సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ సమావేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని సూచించారన్నారు.

Read Also : ఎల్పీజీ, సిఎన్‌జీ సరఫరా స్థిరంగా… బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »