మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ పనుల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దాదాపు 170 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్న ప్రాచీన హనుమంతుని ఆలయాన్ని రహదారి విస్తరణలో భాగంగా తొలగించారు. అయితే ఆలయంలోని హనుమంతుడి విగ్రహాన్ని మాత్రం అక్కడి నుంచి తరలించలేకపోయారు. జేసీబీలు, క్రేన్లు, ఇతర భారీ యంత్రాలతో నాలుగు రోజుల పాటు ప్రయత్నించినా విగ్రహం ఒక్క అంగుళం కూడా కదలకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
సింహస్థ కుంభమేళా కోసం రోడ్ల విస్తరణ
2028లో జరగనున్న సింహస్థ కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని ఉజ్జయినిలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా పుణ్యకార్యంలో భాగంగా కోట్లాది మంది భక్తులు క్షిప్రా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఉజ్జయినికి తరలివస్తారు.
ఈ నేపథ్యంలో కంటాల్ చౌరాహా–చత్రి చౌక్ రహదారి విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా రహదారికి అడ్డుగా ఉన్న పురాతన హనుమంతుని ఆలయాన్ని తొలగించాల్సి వచ్చింది. అయితే విగ్రహాన్ని టాకీ చౌక్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రాంతానికి సురక్షితంగా తరలించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.
MIRACLE 🚨 Machines stopped and the cranes could not move it, but the 170-year-old Hanuman idol in Ujjain remained firmly in place.
Attempts to shift the sacred idol for road widening did not succeed.
Now, the site has been handed over to IIT for scanning and further study.…
— News Algebra (@NewsAlgebraIND) September 10, 2026
నాలుగు రోజులుగా ప్రయత్నాలు.. కదలని విగ్రహం
ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించినప్పటికీ హనుమంతుడి విగ్రహం మాత్రం తన స్థానంలోనే ఉంది. దాన్ని తరలించేందుకు అధికారులు, సిబ్బంది జేసీబీలు, క్రేన్లతో అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఎంత ప్రయత్నించినా విగ్రహం కదల్లేదు.
గత కొన్ని రోజుల్లో నాలుగు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అధికారులు భారీ యంత్రాల వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. విగ్రహం పునాది, దాని చుట్టూ ఉన్న నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
‘దైవలీల’ అంటున్న భక్తులు
విగ్రహాన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు భక్తులు దీన్ని దైవలీలగా అభివర్ణిస్తున్నారు. ఆలయ ప్రాంగణం వద్దకు పెద్ద సంఖ్యలో కోతులు చేరుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తుల విశ్వాసం మరింత బలపడింది.
ఆలయ అర్చకుడు మహేష్ బైరాగి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. స్వామివారు ఇక్కడే ఉండాలనుకుంటున్నారనే సంకేతాలుగా వరుసగా విఫలమవుతున్న ప్రయత్నాలను భావిస్తున్నట్లు తెలిపారు. విగ్రహాన్ని తరలించాల్సిన పరిస్థితి ఉంటే ఎలాంటి నష్టం జరగకుండా, ప్రస్తుతం ఉన్న రూపంలోనే భద్రంగా తరలించాలని కోరారు.
పురాతన చరిత్రపై భిన్న వాదనలు
ఈ ఆలయానికి సుమారు 170 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటు కాలం నాటిదని కొందరు పేర్కొంటుండగా, పరమార రాజవంశం కాలం నాటి చరిత్ర దీనికి ఉందనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవని తెలుస్తోంది.
ప్రస్తుతం విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకుండా తాత్కాలికంగా షెడ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. పురావస్తు శాఖ, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే విగ్రహాన్ని ఎలా తరలించాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
అభివృద్ధి వర్సెస్ విశ్వాసం
ఆలయాన్ని తొలగించనున్నట్లు తెలిసిన సమయంలో స్థానికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తరతరాలుగా పూజలు అందుకుంటున్న ఆలయాన్ని ఎలా తొలగిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నగర అభివృద్ధి, సింహస్థ కుంభమేళా ఏర్పాట్లలో భాగంగా రహదారి విస్తరణ అవసరమని అధికారులు వివరించడంతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.
ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే.. అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న ఈ విగ్రహాన్ని అధికారులు సురక్షితంగా ఎలా తరలిస్తారు? లేక ఇక్కడే ఉంచే మార్గాన్ని అన్వేషిస్తారా? నిపుణుల నివేదిక తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు హనుమంతుడి విగ్రహం కదలకపోవడం ఉజ్జయినిలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
