శబరిమల కేసు: “మహిళలను అంటరానివారిగా చూడలేం”.. సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు!

శబరిమల ఆలయ ప్రవేశం కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడాన్ని అంటరానితనంగా (ఆర్టికల్ 17) పరిగణించడాన్ని ఆమె తప్పుపట్టారు. విచారణలో చోటుచేసుకున్న ఆసక్తికర వాదనలు ఇక్కడ...

Justice B.V. Nagarathna sitting in Supreme Court bench during Sabarimala case hearing
Justice Nagarathna on Sabarimala Article 17

న్యూఢిల్లీ: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి 10 నుండి 50 ఏళ్ల వయస్సున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో ఇవాళ కీలక విచారణ జరిగింది. 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తుండగా, ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఆర్టికల్ 17 ప్రస్తావనపై అభ్యంతరం:

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటల్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. 2018 నాటి శబరిమల తీర్పును ప్రస్తావించారు. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం ఒక రకమైన అంటరానితనం (Untouchability) కిందకే వస్తుందని, ఇది ఆర్టికల్ 17 ఉల్లంఘన అని అప్పటి ధర్మాసనం అభిప్రాయపడిందని గుర్తు చేశారు. అయితే ఈ వాదనను జస్టిస్ నాగరత్న తప్పుపట్టారు.

మహిళగా నా అభ్యంతరం: “ఒక మహిళగా ఆలోచిస్తే.. నెలకు మూడు రోజుల పాటు మహిళలను అంటరానివారిగా చూడటం, నాలుగో రోజు వారు అంటరానివారు కాదని చెప్పడం సరైనది కాదు. ఆర్టికల్ 17 కేవలం ఆ మూడు రోజులకే ఎలా వర్తిస్తుంది?” అని ఆమె ప్రశ్నించారు.

భావన సరికాదు: శబరిమల కేసులో ఆర్టికల్ 17ని అప్లై చేయడం అంటే మహిళలను అంటరానివారిగా పరిగణిస్తున్నట్లు అర్థం వస్తుందని, దీనిపై తనకు తీవ్ర అభ్యంతరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

తుషార్ మెహతా వివరణ:

  • జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలపై స్పందించిన తుషార్ మెహతా, తాను కేవలం రుతుక్రమ సమస్య గురించి మాట్లాడటం లేదని క్లారిటీ ఇచ్చారు.
  • శబరిమల ఆలయ ప్రవేశం అనేది కేవలం వయస్సు సంబంధిత అంశమని, ఇది నాలుగు రోజులకు సంబంధించినది కాదని ఆయన వాదించారు.
  • 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలందరినీ ఒకే వర్గంగా చూస్తూ గతంలో తీర్పునిచ్చారని ఆయన గుర్తు చేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అనేది కుల వివక్ష, అస్పృశ్యతను రూపుమాపేందుకు ఉద్దేశించినది. అయితే, శబరిమల కేసులో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోవడాన్ని కూడా ‘అంటరానితనం’ అనే కోణంలో చూడవచ్చా లేదా? అనేదే ఇక్కడి ప్రధాన చర్చ.

Also read: వేయి స్తంభాల గుడికి మహర్దశ: రూ. 14.44 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. కాకతీయ వైభవం పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »