రాజకీయాలు అనేవి విధానాలు, ప్రజా సమస్యలు, అభివృద్ధి చుట్టూ తిరగాల్సి ఉండగా… వ్యక్తిగత విమర్శలు, ముఖ్యంగా సినీ నటీమణుల పేర్లు లాగడం పెరుగుతున్న ధోరణి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ తరహా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినీ రంగంతో సంబంధం ఉన్న మహిళలను రాజకీయ వాదోపవాదాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న సామాన్యుల నుంచి వినిపిస్తోంది.
త్రిషని ఎందుకు లాగారు…
తమిళనాడులో నటి త్రిష పేరు చుట్టూ రాజకీయ చర్చలు ముదిరాయి. ప్రత్యక్షంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వని ఆమెను కొందరు నేతలు విమర్శల కోసం ప్రస్తావించడం అభిమానులు, మహిళా సంఘాల ఆగ్రహానికి దారితీసింది. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఆయనపై విమర్శలు గుప్పించే క్రమంలో త్రిష పేరును లాగడం వివాదాస్పదమైంది. సినిమాల్లో కలిసి నటించారనే కారణంతో వ్యక్తిగత సంబంధాలపై వ్యాఖ్యలు చేయడం తగదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదే తరహా పరిస్థితి తెలంగాణలోనూ కనిపించింది. నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరును రాజకీయ విమర్శల్లో ప్రస్తావించడం చర్చకు దారి తీసింది. భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల తారక రామారావుతో సంబంధాలు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు కారణమయ్యాయి. ఈ అంశంపై అధికారిక ఆధారాలు లేకపోయినా, పేర్లు వినిపించడం మాత్రమే పెద్ద చర్చగా మారింది.
మరో సందర్భంలో నటి సమంత వ్యక్తిత్వంపై వచ్చిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి. తరువాత క్షమాపణలు చెప్పిన, ఈ తరహా రాజకీయ సంస్కృతి కొనసాగుతూనే ఉందన్న భావన బలపడింది. సోషల్ మీడియా యుగంలో ఒక వ్యాఖ్యే పెద్ద దుమారంగా మారుతున్న తరుణంలో, ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు.
ఇది తగదు…
సినీ నటీమణులు రాజకీయాల్లో చురుకుగా లేని సందర్భాల్లో కూడా వారి పేర్లు వినిపించడం, వ్యక్తిగత జీవితం మీద ఊహాగానాలు చేయడం మహిళా గౌరవానికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లో కలిసి నటించారని బయట కూడా అదే అనుబంధం ఉంటుందని అనుమానించడం తగదని విశ్లేషకులు అంటున్నారు.
తమిళనాడులో త్రిష, తెలంగాణలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఇద్దరూ రాజకీయాలకు దూరంగా తమ వృత్తిపరమైన పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సాఫ్ట్ టార్గెట్‌లుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే రాజకీయ నాయకులు వ్యక్తిగత దాడులు మానుకుని, ప్రజా సమస్యలపైనే దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారు. మహిళల పేర్లను ఆయుధాల్లా ఉపయోగించే సంస్కృతి మారాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయం బలపడుతోంది.