దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ వినియోగదారులు ప్రతిరోజూ స్పామ్ కాల్స్, ఫేక్ ఆఫర్లు, మోసపూరిత SMSలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా ఫోన్లు మోగుతుండటంతో వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని టెలికాం నియంత్రణ సంస్థ Telecom Regulatory Authority of India (TRAI) వినియోగదారుల కోసం రెండు కొత్త, అప్‌గ్రేడ్ చేసిన మొబైల్ అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లతో స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లపై నేరుగా చర్య తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ప్రభుత్వం ప్రారంభించిన రెండు యాప్‌లు ఇవే
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు యాప్‌లు TRAI DND App మరియు TRAI MySpeed App.
ఈ యాప్‌లు సాధారణ మొబైల్ వినియోగదారులకు రెండు వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా రూపొందించబడ్డాయి.
DND యాప్ – స్పామ్ కాల్స్‌కు చెక్
TRAI DND యాప్ ప్రధానంగా టెలిమార్కెటర్లు లేదా అనుమానాస్పద నంబర్ల నుంచి వచ్చే కాల్స్, SMSలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులు ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ ఇవ్వబడుతుంది. ఆ ఫిర్యాదును సంబంధిత టెలికాం సంస్థలు TRAI నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా, ఈ యాప్ వినియోగదారుల గోప్యతను కాపాడే విధంగా రూపొందించబడింది. స్పామ్ గుర్తింపును సులభతరం చేయడానికి కాల్ లాగ్స్, మెసేజ్‌లకు యాక్సెస్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుడి ఇష్టంపైనే ఉంటుంది. యాక్సెస్ ఇవ్వకపోయినా మాన్యువల్‌గా ఫిర్యాదు చేసే అవకాశం యాప్‌లో ఉంటుంది. ఫిర్యాదు స్థితిని కూడా యూజర్లు ట్రాక్ చేయగలరు.
MySpeed యాప్ – నెట్‌వర్క్ నాణ్యతపై నిఘా
ప్రస్తుతం స్పామ్ కాల్స్ మాత్రమే కాదు, మొబైల్ ఇంటర్నెట్ సరిగా లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా TRAI TRAI MySpeed యాప్ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ డేటా డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే నెట్‌వర్క్ లేటెన్సీ, కాల్ జాప్యం, డేటా నాణ్యత వంటి అంశాలను కూడా మాన్యువల్‌గా పర్యవేక్షించవచ్చు.
TRAI ప్రకారం, MySpeed యాప్ ద్వారా సేకరించిన డేటా టెలికాం కంపెనీలు మరియు నియంత్రణ సంస్థలకు నెట్‌వర్క్ క్వాలిటీ మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అధికారిక గణాంకాల ప్రకారం 2025 సంవత్సరంలో DND యాప్ ద్వారా 1.7 మిలియన్లకు పైగా స్పామ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది దేశంలో స్పామ్ కాల్స్ ఎంత తీవ్రమైన సమస్యగా మారాయో స్పష్టం చేస్తోంది.
Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో
ఈ రెండు యాప్‌లు Android మరియు iOS ప్లాట్‌ఫామ్‌లలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని స్పామ్ కాల్స్, నెట్‌వర్క్ సమస్యలను నేరుగా నివేదించవచ్చని TRAI సూచించింది. స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడమే కాకుండా, నెట్‌వర్క్ కవరేజ్ మెరుగుపరచడంలో కూడా ఈ యాప్‌లు సాధారణ మొబైల్ వినియోగదారులకు శక్తివంతమైన సాధనాలుగా మారనున్నాయి.