Bhatti Vikramarka | మహిళా ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా బలపడితే రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. మహిళల స్వయం ఉపాధి, యువతకు ఉపాధి అవకాశాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
Read Also : ఎగ్జిబిటర్ పర్సంటేజ్ వివాదం.. పరిష్కారానికి రంగంలోకి తెలుగు ఫిలిం ఛాంబర్
హైదరాబాద్ మురికివాడల్లో నివసించే యువ మహిళా పారిశ్రామికవేత్తలకు యుద్ధ ప్రాతిపదికన రుణాలు అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు, సేవారంగంలోకి మహిళలు పెద్దఎత్తున రావాలని ప్రభుత్వం ఆశిస్తున్నదన్నారు. ఈ దిశగా బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న భట్టి.. అవి కేవలం ఆర్థిక సంస్థలుగా కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ ప్రస్తుతం దేశ సగటు కంటే అధికంగా 10.7 శాతం ఆర్థిక వృద్ధిరేటుతో ముందుకు సాగుతోందన్నారు. తలసరి ఆదాయంలోనూ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని తెలిపారు.
Read Also : స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్ షూట్ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్ హసన్..!
విద్యా రుణాల విషయంలో కూడా బ్యాంకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భట్టి సూచించారు. విద్యార్థులకు అందించే రుణాలు భవిష్యత్తుపై పెట్టుబడులాంటివని పేర్కొన్నారు. ఉన్నత విద్య కోసం రుణాలు కోరుతున్న విద్యార్థులకు అనవసర అడ్డంకులు సృష్టించవద్దని బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయ రంగంలో లక్ష్యానికి మించి 101.88 శాతం రుణాలు పంపిణీ చేసిన బ్యాంకులను భట్టి అభినందించారు. ఇదే ఉత్సాహంతో మహిళలు, దళితులు, గిరిజన యువ పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలకు కూడా రుణాల పంపిణీ పెంచాలని కోరారు. సౌరశక్తి ప్రాజెక్టులకు సైతం ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, రీజినల్ రింగ్ రోడ్, కొత్త ఫార్మా, టెక్స్‌టైల్ ఇండస్ట్రియల్ హబ్‌ల నిర్మాణంలో బ్యాంకుల భాగస్వామ్యం అత్యంత అవసరమని భట్టి పేర్కొన్నారు.
Read Also : కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌పై అదనంగా రూ.3 అదనంగా సుంకం..!
సంక్షేమ పథకాలు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ ద్వారా తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించాలని కోరారు. రైతులు రుణాల చెల్లింపులో క్రమశిక్షణ పాటిస్తున్నందున పంట రుణాల మంజూరులో ఆలస్యం చేయవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీని ఒకే దశలో అమలు చేసి రైతులకు భరోసా కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 30 శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారని, వారికి కూడా సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని తుమ్మల సూచించారు. దీని వల్ల అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందన్నారు.
Read Also : పట్టపగలే చుక్కలు కనిపించేలా అలుముకోనున్న చీకట్లు..! శతాబ్దంలోనే సుదీర్ఘ సూర్యగ్రహణం..!


