రూ.లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయింది.. పునరుద్ధరణ పనులు ప్రారంభించాం : సీఎం రేవంత్‌

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సాగునీటి ప్రాజెక్టులు, మహిళా సాధికారత, ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం, ఆరోగ్య రంగం, పేదల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించారు. రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వెల్లడించారు.

CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయం, మహిళా సాధికారత, ఉపాధి, విద్య, సామాజిక న్యాయం రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో గత రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం తెలిపారు. 2004లో జలయజ్ఞం కింద ప్రారంభమైన ప్రాజెక్టులతో పాటు 2014-15లో ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. అవసరమైన భూసేకరణ చేపట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణకు కీలకమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని, తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఇటీవల లేఖ రాసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.1 లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని, దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడిందన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు.

Read Also : టీచర్‌ ప్రమోషన్లకు టెట్‌ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మహిళలకు ఆర్థిక శక్తిగా మారే అవకాశాలు

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని సీఎం పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి ద్వారా రూ.1 లక్ష కోట్ల రుణాలు అందించడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళా సంఘాల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, 1000 ఆర్టీసీ బస్సుల యాజమాన్యంలో మహిళలు భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 8 వేల స్త్రీశక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని సీఎం తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ, వైద్యారోగ్య శాఖల ద్వారా రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజినీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, విద్యాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలోని 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఇప్పటివరకు 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేయగా, వారిలో 838 మంది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు పొందారని తెలిపారు. రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే ప్రీ-ప్రైమరీ తరగతులు అందుబాటులోకి వచ్చాయని, ఈ ఏడాది మరో 2769 పాఠశాలల్లో వాటిని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also : భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు..!

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ

పేదలకు గృహ భద్రత కల్పించేందుకు మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు సీఎం తెలిపారు. కేవలం 13 నెలల్లో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తైందని, సెప్టెంబర్ 17 నాటికి మరో రెండు లక్షల ఇళ్లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, గతంలో మంజూరై అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు, 19.44 లక్షల కొత్త సభ్యుల పేర్లను ఇప్పటికే ఉన్న కార్డుల్లో చేర్చినట్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేను తెలంగాణ విజయవంతంగా నిర్వహించిందని సీఎం తెలిపారు. ఈ సర్వే ఇప్పుడు దేశవ్యాప్తంగా జనగణనకు ఆదర్శంగా నిలిచిందన్నారు. 59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా ఉపవర్గీకరిస్తూ చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించిందన్నారు. స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

Read Also : ప్రభుత్వ వర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతి..!

ఆరోగ్య రంగానికి రూ.11 వేల కోట్లు

రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, నిమ్స్ విస్తరణ, ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని సీఎం పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ (EAGLE) బృందానికి 59 వేల మంది యాంటీ డ్రగ్ వాలంటీర్లు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించామని, యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర, కాళేశ్వరం ఆలయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కోసం బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హజ్ యాత్రికులపై పడిన అదనపు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని, మెదక్ చర్చి అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ అన్ని మతాల సమన్వయానికి ప్రతీకగా నిలుస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Read Also : గంట‌కు 280 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లే ట్రైన్ ఇదే..! బుల్లెట్ రైలు ఫ‌స్ట్ లుక్ రివీల్‌..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »