మహిళలు నిర్భయంగా పని చేయాలి.. క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్ పిలుపు

మహిళా సంక్షేమం (Women Welfare)పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ (IAS Garima Agarwal) కీలక సూచనలు చేశారు. పని ప్రదేశంలో మహిళల రక్షణ చట్టం 2013 (POSH Act 2013), అంతర్గత ఫిర్యాదుల కమిటీ (Internal Complaints Committee), షీ బాక్స్ పోర్టల్ (She Box Portal) వినియోగం గురించి అవ‌గాహ‌న క‌ల్పించారు. మహిళలు నిర్భయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

IAS Garima Agrawal | ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధాల పరిష్కారాల చట్టం 2013పై జిల్లా సంక్షేమశాఖ ఆధ్వ‌ర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 278 ఇంటర్నల్ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ గురించి వివరించారు. ఈ సంద‌ర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. పనిచేసే ప్రదేశంలో మహిళలు ఎలాంటి వివక్షకు గురికాకుండా, స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేసేందుకు ఈ చట్టం సౌకర్యాలను కల్పిస్తుందని వివరించారు.

ఈ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఉద్యోగం నుంచి తొలగించడంతోపాటు జైలు శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి యజమాని, కార్యాల‌య అధిప‌తి మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా పని చేసే వాతావరణాన్ని కల్పించాలని, యజమాని, అధికారి ఈ బాధ్యతలో విఫలమైతే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతోపాటు రూ.50వేల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పని ప్రదేశం అంటే కార్యాలయంతో పాటు విధి నిర్వహణలో భాగంగా చేసే ప్రయాణాలు, సందర్శనలు, ఫీల్డ్ ట్రిప్పులు, కార్యాలయంతో సంబంధం ఉన్న ప్రతి చోటను పని ప్రదేశం కిందికి వస్తాయని వివరించారు. అలాగే, ఉద్యోగి అంటే రెగ్యులర్, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్, ప్రొబేషనర్, అప్రెంటిస్, సేల్స్ మెన్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్, వర్కర్ ఇలా ఏ పేరుతో పిలిచినా కార్యాలయంలో పని చేసే ప్రతి ఉద్యోగికి ఈ చట్టం వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.

Read Also : ఫెయిల్యూర్ నుండి సక్సెస్ వైపు.. మహిళలూ! మీ ప్రయాణం ఇక్కడి నుండే మొదలు

ఇంటర్నల్ కమిటీని ప్రతి 10 మంది కంటే ఎక్కువగా ఉన్న కార్యాలయంలో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, పది మంది కంటే తక్కువ ఉన్న లేదా సీనియర్ ఉమెన్ ఆఫీసర్ లేకపోయినా ఆ ప్రాంతంలోని మరొక అధికారికే అప్పగించడం లేదా ఆ శాఖలోని మరో ప్రాంతంలో ఉన్న అధికారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇంటర్నల్ కమిటీలో సీనియర్ మహిళతోపాటు ఇద్దరూ ఉద్యోగులు మహిళల కోసం కృషి చేసేవారు అలాగే మరొక స్వచ్ఛంద సేవా సంస్థ లేదా ఉద్యోగ సంఘాల నుంచి ఉంటారని పేర్కొన్నారు. వీరందరూ మహిళలపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తారని వివరించారు. అలాగే 10 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న కార్యాలయాల ఉద్యోగులకు, డొమెస్టిక్ ఎంప్లాయిస్ కి లోకల్ లెవెల్ కంప్లైంట్ కమిటీ అనేది జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

అలాగే ప్రభుత్వం ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా షి బాక్స్ పోర్టల్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఆన్లైన్ ద్వారా కూడా మహిళలు వారి ఫిర్యాదులను చేయవచ్చని తెలిపారు. అలాగే ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులకు పరిహారం కూడా చెల్లించమని ఆదేశించడం జరుగుతుందని, క్రిమినల్ చర్యలకు పోలీసు వారికి సిఫారసు చేయడం కూడా జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జి ఒక పిజికల్ షి బాక్స్ ని కూడా ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా షి బాక్స్ లో ఎవరైనా కూడా ఫిర్యాదులు చేయవచ్చని నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పరిశీలించి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి పట్ల తప్పుడు ఫిర్యాదులు చేసే వారికి కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం శిక్షకులు ప్రభాకర్, జిల్లా లోకల్ లెవెల్ కమిటీ సభ్యులు అఫ్జల్ బేగం,జ్యోతి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, సిడిపివోలు సౌందర్య, ఉమారాణి , సుచరిత, డీ హబ్ కోఆర్డినేటర్ రోజా, డిసిపిఓ కవిత, సఖీ అడ్మిన్ మమత, జిల్లా అధికారులు బిసి సంక్షేమ అధికారి సౌజన్య, జీఎం ఇండస్ట్రీస్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Read Also : మహిళా రైతుల శక్తి 2026లో ప్రపంచ దృష్టి… భారత వ్యవసాయంలో మహిళల విప్లవం!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »