కరీంనగర్‌లో రంగురంగుల చేపల పెంపకం.. 20 మంది మహిళలకు కొత్త జీవనోపాధి
కరీంనగర్ జిల్లాలో మహిళలకు కొత్త జీవనోపాధి మార్గం అందుబాటులోకి వచ్చింది. మత్స్య పారిశ్రామిక సహకార మహిళా సంఘాల అభివృద్ధే లక్ష్యంగా జిల్లా మత్స్యశాఖ తొలిసారిగా **అలంకార చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది**. రంగురంగుల ఆక్వేరియం చేపలను పెంచుతూ కట్టరాంపూర్ మత్స్య పారిశ్రామిక సహకార మహిళా సంఘానికి చెందిన 20 మంది మహిళలు ఆదాయం పొందుతున్నారు.
దిగువ మానేరు జలాశయంలో పెంపకం
కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రభుత్వ మత్స్యశాఖ అధికారుల సహకారంతో అలంకార చేపల పెంపకం చేపడుతున్నారు. తొలుత రంగురంగుల అలంకార చేప పిల్లలను చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడి ఆక్వేరియంలలో అభివృద్ధి చేస్తున్నారు.
సాధారణంగా ప్రైవేట్ రంగంలో ఎక్కువగా కనిపించే అలంకార చేపల పెంపకాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో చేపట్టడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
కాకినాడలో ప్రత్యేక శిక్షణ
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కాకినాడలో మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వివిధ రకాల చేపలను ఎలా పెంచాలి, పిల్లలు కనే చేపలను ఎలా సంరక్షించాలి, గుడ్లు పెట్టే చేపలను ఏ విధంగా పెంచాలి అనే అంశాలపై శిక్షణ అందించారు.
అలాగే ఆక్వేరియంల తయారీ, చేపల సంరక్షణతో పాటు మార్కెటింగ్‌లో పాటించాల్సిన మెలకువలను కూడా అధికారులు నేర్పించారు.
చేపల పెంపకం అంత సులభం కాదు
అలంకార చేపలను పెంచడం సాధారణ చేపల పెంపకంతో పోలిస్తే అంత సులభం కాదని నిర్వాహకులు చెబుతున్నారు. చేపల రకాన్ని బట్టి ప్రత్యేక ఉష్ణోగ్రత, అనుకూలమైన నీటి వాతావరణం అవసరమవుతుంది. అందుకే వీటి పెంపకానికి ప్రత్యేక శిక్షణతో పాటు నిరంతర పర్యవేక్షణ అవసరమవుతోంది.
ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ అనుకూలమైన నీటి వాతావరణంలో చేప పిల్లలను అభివృద్ధి చేస్తున్నారు.
రూ.30 నుంచి రూ.150 వరకు విక్రయం
గతంలో కరీంనగర్‌లో అలంకార చేపలను కొనుగోలు చేయాలంటే చెన్నై, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుంచి ఎక్కువ ఖర్చుతో తెప్పించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం స్థానికంగానే వీటిని అందుబాటులోకి తీసుకురావడంతో తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడిందని మహిళా సంఘం సభ్యులు తెలిపారు.
ప్రతి వారాంతంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వద్ద, షాగ్ స్టాల్స్, డీ-మార్ట్, డీర్ పార్క్ వంటి ప్రముఖ ప్రదేశాల వద్ద మహిళలు రంగురంగుల ఆక్వేరియం చేపలను విక్రయిస్తున్నారు. చేపల రకాన్ని బట్టి **రూ.30 నుంచి రూ.150 వరకు** ధరకు విక్రయిస్తున్నారు.
మహిళలకు ఆర్థికంగా అండగా..
మత్స్యశాఖ సహకారంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం కట్టరాంపూర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 20 మంది మహిళలకు కొత్త ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. అలంకార చేపల పెంపకం, ఆక్వేరియం తయారీ, విక్రయాలు వంటి అంశాల్లో శిక్షణ పొందిన మహిళలు స్వయంగా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఆదాయం పొందుతున్నారు.
మత్స్య రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, స్థానికంగానే అలంకార చేపలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం కరీంనగర్‌లో కొత్త తరహా ఉపాధి అవకాశానికి బాటలు వేస్తోంది.


