Monsoon | యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉక్కపోతతో పాటు ఎండ వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు త్వరలో ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల పురోగతి ఆశాజనకంగా ఉండటంతో జూన్ రెండో వారంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం… జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో వర్షాకాలం ప్రారంభమై, ఎండల తీవ్రత క్రమంగా తగ్గనుంది. దక్షిణ భాగంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళతో పాటు పలు సమీప ప్రాంతాలను కమ్మేశాయి. రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల్లో తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితులు రుతుపవనాల పురోగతికి దోహదపడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షద్వీప్, కొమోరిన్ ప్రాంతం నుంచి ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవనాల ప్రభావం విస్తరించినట్లు వెల్లడించారు.
Read Also : తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్..
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండగా, మధ్యాహ్న సమయాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాల్పుల కారణంగా ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా మందగించిన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే జూన్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉండగా, జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉండొచ్చని తెలిపింది. జూన్ 5 తర్వాత చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38-39 డిగ్రీల మధ్య స్థిరపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
Read Also : భాష ఏదైనా ఫిర్యాదు ఇక సులభం.. ఏఐ కాప్‌రైటర్ యాప్‌ని ఆవిష్కరించిన సజ్జనార్
ఈ వర్షాలు పూర్తిస్థాయి ఉపశమనం ఇవ్వకపోయినా, ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గేందుకు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, జూన్ 3 వరకు ఎండల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించింది. రానున్న నాలుగు రోజుల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మే 31న రాష్ట్రంలోని 28 జిల్లాల్లో, జూన్ 1న 11 జిల్లాల్లో, జూన్ 2న 12 జిల్లాల్లో, జూన్ 3న 17 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో 45.3 డిగ్రీలు, ములుగు జిల్లా మంగపేటలో 45.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లా మామడలో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Read Also : ఇక మూడుజోన్లకే దక్షిణ మధ్య రైల్వే.. జూన్ నుంచి కొత్త పరిపాలన వ్యవస్థ..!


