South Central Railway | దక్షిణ మధ్య రైల్వే (SCR)లో కీలక పరిపాలనా మార్పులకు రంగం సిద్ధమైంది. జూన్ ఒకటి నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి రానుండటంతో ప్రస్తుతం కొనసాగుతున్న పరిపాలనా నిర్మాణంలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు సికింద్రాబాద్ కేంద్రంగా ఆరు డివిజన్లతో కొనసాగుతున్న కార్యకలాపాలు మే 31తో ముగియనున్నాయి. అనంతరం జోన్ పరిధి మూడు ప్రధాన డివిజన్లకే పరిమితం కానుంది. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగనున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమల్లోకి రావడంతో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఆ జోన్‌లోకి మారనున్నాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం 6,637 ట్రాక్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న జోన్ ఇకపై 3,589 ట్రాక్ కిలోమీటర్లకే పరిమితం కానుంది. అయితే పరిపాలనా భారం తగ్గుతున్నప్పటికీ, సికింద్రాబాద్ డివిజన్‌పై అదనపు బాధ్యతలు పెరగనున్నాయి.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
సికింద్రాబాద్ డివిజన్‌కు కొత్త సెక్షన్లు
పునర్విభజనలో భాగంగా గుంటూరు డివిజన్‌లోని పగిడిపల్లి–విష్ణుపురం–జాన్‌పహాడ్ రైల్వే సెక్షన్‌ను, గుంతకల్ డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు–వాడి మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. ఈ మార్పులతో సికింద్రాబాద్ డివిజన్ పరిధి సుమారు 204 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దీంతో రైళ్ల రాకపోకల సమన్వయం, సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో ఒత్తిడి పెరిగే అవకాశముందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా డివిజన్ కంట్రోల్‌రూం పనిభారం మరింత పెరగనుంది. రైళ్ల కదలికలను పర్యవేక్షించడం, ఏ రైలుకు ముందు క్లియరెన్స్ ఇవ్వాలనే అంశాలపై స్టేషన్ మాస్టర్లకు సూచనలు జారీ చేయడం వంటి కీలక బాధ్యతలు కంట్రోలర్లపై ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే పునర్వ్యవస్థీకరణ, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు రైల్వే బోర్డు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇటీవల రెండు జోన్లకు చెందిన ఉన్నతాధికారులతో రైల్వే బోర్డు ఛైర్మన్ ఆన్‌లైన్ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జూన్ 1 నుంచి విడివిడిగా పరిపాలనా కార్యకలాపాలు సజావుగా ప్రారంభమయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
Read Also : ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్ గడువును మరో ఏడాది పొడిగించిన ఉడాయ్..!
కొత్త జోన్‌కు భారీగా పోస్టుల మంజూరు
దక్షిణ కోస్తా జోన్ పరిపాలనను బలోపేతం చేసేందుకు రైల్వే బోర్డు ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. జనరల్ మేనేజర్, వివిధ శాఖల ప్రిన్సిపల్ హెడ్ పోస్టులకు అధికారులను నియమించగా, వారు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించారు. కొత్త జోన్‌కు మొత్తం 128 గెజిటెడ్ పోస్టులు, 1,100 నాన్ గెజిటెడ్ పోస్టులను మంజూరు చేశారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే నుంచి పెద్ద ఎత్తున పోస్టులను బదిలీ చేశారు. 35 గెజిటెడ్, సుమారు 980 నాన్ గెజిటెడ్ పోస్టులను కొత్త జోన్‌కు కేటాయించినట్లు తెలిసింది. మిగిలిన పోస్టులను ఇతర రైల్వే జోన్ల నుంచి బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే దక్షిణ కోస్తా జోన్‌లో 30 మంది గెజిటెడ్ అధికారులు, 300 మందికి పైగా నాన్ గెజిటెడ్ సిబ్బంది విధుల్లో చేరినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. కొత్త జోన్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత తూర్పు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రైల్వే పరిపాలన మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read Also : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ..! పెద్ద ఎత్తున సభ్యులుగా చేరుతున్న యువత..!


