NASA | చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మూన్ బేస్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందు కోసం కీలక ఒప్పందాలను చేసుకున్నది. లూనార్ వెహికిల్స్, కార్గో ల్యాండర్లు, డ్రోన్ మిషన్స్ ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసం, అక్కడి నుంచి మార్స్ యాత్ర చేపట్టేందుకు ఈ ప్రాజెక్టు కీలకమని నాసా వెల్లడించింది. వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ మాట్లాడుతూ.. “చంద్రుడిపై ఏర్పాటు చేయబోయే ఈ స్థావరం మానవాళి భూమికి అవతల నిర్మించబోయే తొలి శాశ్వత కేంద్రంగా నిలుస్తుంది. ప్రతి మిషన్ ద్వారా చంద్రుడి వాతావరణంలో జీవించేందుకు, పని చేసేందుకు అవసరమైన అనుభవాన్ని సంపాదిస్తాం” అని పేర్కొన్నారు.
Read Also : ఎంజేపీ గురుకులాలకు ‘బ్రాండ్ ఇమేజ్’ తప్పనిసరి : మంత్రి పొన్నం ప్రభాకర్
మూన్ మిషన్ల కోసమే కాకుండా..
ఈ ప్రాజెక్టును స్వర్ణయుగంగా అభివర్ణించిన ఆయన.. మూన్ మిషన్లు కేవలం చంద్రుడిపైకి వెళ్లడానికే కాకుండా భవిష్యత్‌లో మార్స్ వంటి గ్రహాలపైకి మానవులు వెళ్లేందుకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని వెల్లడించారు. 2026 చివరి నాటికి మూన్ బేస్‌కు సంబంధించిన తొలి మూడు మిషన్లను ప్రయోగించాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి మిషన్ మూన్ బేస్-1లో భాగంగా బ్లూ ఒరిజిన్ సంస్థకు చెందిన “బ్లూ మూన్ మార్క్-1 ఎండ్యూరెన్స్” ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో షాక్లెటన్ కనెక్టింగ్ రిడ్జ్ ప్రాంతానికి పంపనున్నారు. ఈ మిషన్‌లో శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్తారు. రెండో మిషన్ మూన్ బేస్-2లో ఆస్ట్రోబోటిక్ సంస్థ రూపొందించిన “గ్రిఫిన్” ల్యాండర్ ద్వారా 1,100 పౌండ్లకుపైగా సరుకులు, పరికరాలను చంద్రుడిపైకి తరలిస్తారు. ఇందులో భవిష్యత్తు వ్యోమగాముల కోసం వినియోగించనున్న మొబిలిటీ వ్యవస్థలను పరీక్షించే “ఫ్లిప్ రోవర్” సైతం ఉంటుంది.
Read Also : శాంతి భద్రతలపై అలసత్వం సహించను.. పోలీస్ బాస్‌ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
పరిశోధనకు ఇదే కీలకం..
మూడో మిషన్ మూన్ బేస్-3లో ఇంట్యూటివ్ మెషీన్స్ సంస్థ రూపొందించిన “నోవా-సి ట్రినిటీ” ల్యాండర్ ద్వారా పలు పరికరాలను చంద్రుడిపైకి పంపనున్నారు. ముఖ్యంగా చంద్రుడి ఉపరితలంపై కనిపించే రహస్యమైన “లూనార్ స్విర్ల్స్”పై అధ్యయనం చేయనున్న “లూనార్ వెర్టెక్స్” పరిశోధనకు ఈ మిషన్ కీలకంగా పని చేస్తుంది. ఇక 2028 నాటికి ఆర్టెమిస్ వ్యోమగాముల కోసం ప్రత్యేక లూనార్ టెరైన్ వెహికిల్స్ (ఎల్‌టీవీలు)ను అందుబాటులోకి తేవాలని నాసా నిర్ణయించింది. ఇందుకోసం ఆస్ట్రోల్యాబ్ సంస్థకు 219 మిలియన్ డాలర్లు, లూనార్ అవుట్‌పోస్ట్ సంస్థకు 220 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. ఆస్ట్రోల్యాబ్ రూపొందిస్తున్న వాహనం వ్యోమగాములు, సరఫరా సామగ్రిని చంద్రుడి ఉపరితలంపై తరలించేలా రూపకల్పన చేస్తున్నారు. లూనార్ అవుట్‌పోస్ట్ అభివృద్ధి చేస్తున్న “పెగాసస్” రోవర్‌ను మనుషులు నియంత్రించడంతో పాటు ఆటోమేటిక్‌గా నడిపించొచ్చు. గంటకు 9 మైళ్లకుపైగా వేగంతో ఇది ప్రయాణించగలదని నాసా తెలిపింది.
Read Also : కాంగ్రెస్ సర్కారు తెలంగాణ గొంతు కోసేందుకు రెడీ అయ్యింది.. మాజీ మంత్రి సింగిరెడ్డి విమర్శలు..
మూన్‌ఫాల్ పేరిట స్పెషల్ మిషన్..
అపోలో యుగంతో పోలిస్తే భవిష్యత్తు వ్యోమగాములు చంద్రుడిపై మరింత దూరం ప్రయాణించగలరని, మానవ మిషన్లు లేని సమయంలో కూడా ఈ రోవర్లు స్వతంత్రంగా పని చేస్తాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. మూన్ బేస్ వందల చదరపు మైళ్ల పరిధిలో విస్తరించే శాశ్వత స్థావరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దశలవారీగా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు మూన్ బేస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ గార్సియా గోలాన్ తెలిపారు. “మూన్‌ఫాల్” పేరుతో మరో ప్రత్యేక మిషన్‌ను కూడా నాసా ప్రకటించింది. ఇందులో నాలుగు చిన్న డ్రోన్లు చంద్రుడి ఉపరితలంపై ఎగురుతూ భవిష్యత్తు ల్యాండింగ్ ప్రాంతాలను పరిశీలించడంతో పాటు నీటి మంచు నిల్వల కోసం అన్వేషిస్తాయి. ఈ డ్రోన్లను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లే స్పేస్‌క్రాఫ్ట్ నిర్మాణ బాధ్యతను ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ సంస్థకు అప్పగించింది నాసా. ఈ మొత్తం ప్రాజెక్టుల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యమే ఎక్కువ ఉందని నాసా పేర్కొంది. 1960ల్లో అనుసరించిన విధానాన్నే మళ్లీ తీసుకువస్తున్నామని, ప్రతి మిషన్ నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని జారెడ్ ఐజాక్‌మన్ పేర్కొన్నారు. దక్షిణ ధ్రువంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందు కోసమే అక్కడ మూన్ బేస్ ఏర్పాటు చేయనున్నట్లు నాసా వివరించింది.
Read Also: రైతు నోట్లో మట్టికొట్టారు.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్ ఘాటు లేఖ..!


