ద్రోణి ప్రభావం: మరో మూడు రోజులు భారీ వర్షాల హెచ్చరిక ..పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తంగా ఉండాలి

ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Heavy Rains Alert AP and Telangana
Heavy Rains Alert AP and Telangana

ఆంధ్రప్రదేశ్‌లో గత వారం నుంచి కొనసాగుతున్న వర్షాలు మరింత తీవ్రం కానున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం, వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, పిడుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారాయి. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.

చెట్ల కింద నిల‌బ‌డ‌కూడ‌దు..

ఇక గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు.

పిడుగుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ స్తంభాలు, తీగల దగ్గర ఉండటం ప్రాణాపాయానికి దారితీస్తుందని అధికారులు హెచ్చరించారు. హోర్డింగ్‌లు, బలహీన నిర్మాణాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పంట‌కి న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం..

ఇక రైతులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. రబీ పంటలు కోత దశకు చేరుకున్న ఈ సమయంలో వర్షాలు కురవడం వల్ల పంట నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఉండటంతో, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వాటిని రక్షించుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, బుధవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఆదిలాబాద్ నుంచి రంగారెడ్డి వరకు పలు ప్రాంతాల్లో వర్షాల ప్రభావం ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, పిడుగుల ప్రమాదం నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే ఈదురుగాలులు వీస్తున్న సమయంలో హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల దగ్గర ఉండటం ప్రమాదకరమని తెలిపారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు.

ఇక మంగళవారం హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేట ప్రాంతంలో 51.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా నమోదైంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అధికారులు సమీక్షిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »