Vijayawada Doondi Ganesh 2026: భారీ గణేష్ విగ్రహం అంటే వెంటనే ఖైరతాబాద్ గణపతి గుర్తుకొస్తుంది. అయితే ఈసారి విజయవాడలో అంతకంటే మూడు అడుగుల ఎత్తైన మహా గణపతి భక్తులను ఆకట్టుకోనున్నాడు. దూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏకంగా 72 అడుగుల పంచముఖ వరసిద్ధి వినాయకుడి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.
ఖైరతాబాద్‌లో సాధారణంగా ఏర్పాటు చేసే 69 అడుగుల గణపతి కంటే ఈ విగ్రహం మూడు అడుగులు ఎత్తుగా ఉండనుంది. అయితే ఎత్తులోనే కాకుండా.. విగ్రహం నిర్మాణం, పూజలు, నిమజ్జనం, మట్టి పునర్వినియోగంలోనూ ప్రత్యేకతను చాటుకోనుంది.
పంచముఖ వరసిద్ధి వినాయకుడి ప్రత్యేకత ఏమిటి?
విజయవాడలో రూపొందిస్తున్న ఈ మహా గణపతి పంచముఖ రూపంలో దర్శనమివ్వనున్నాడు. ఐదు తలలు, పది చేతులతో సింహాసనంపై ఆసీనుడైన వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.
గణపతి విగ్రహానికి కుడివైపున లక్ష్మీ నరసింహ స్వామి, ఎడమవైపున లలితా త్రిపుర సుందరి దేవి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.
ఈ భారీ విగ్రహం తయారీ కోసం సుమారు 250 మంది కళాకారులు శ్రమిస్తున్నారు. దూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు వరుసగా ఆరో ఏడాదికి చేరుకున్నాయి.
డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న 72 అడుగుల భారీ మట్టి విగ్రహం
ఇవి కూడా చదవండివేదిక:సితార సెంటర్, విజయవాడhttps://t.co/hzyc0EjT5M#doondiganesha #72feetganeshinvijayawada #doondirakesh #doondiganeshasevasamithi #ecofriendlyganesha pic.twitter.com/1mAn22IiaQ
— Doondi Rakesh (@DoondiRakesh) September 12, 2026
11 రోజుల పాటు ప్రత్యేక పూజలు
గణపతి ఉత్సవాలను 11 రోజుల పాటు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా పాటలకు బదులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.
- హోమాలు
- కల్యాణాలు
- వ్రతాలు
- ప్రత్యేక పూజలు
- మహిళలతో సామూహిక కార్యక్రమాలు
- అభిషేకాలు
వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వేలాది మంది మహిళలు, భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ విగ్రహానికి పర్యావరణహిత నిర్మాణం
ఈ మహా గణపతి విగ్రహం నిర్మాణంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ వంటి పదార్థాలను ఉపయోగించడం లేదని నిర్వాహకులు తెలిపారు. కేవలం బంకమట్టి, జనపనార, కొబ్బరి పీచు, గోనె సంచులు వంటి పర్యావరణహిత పదార్థాలతో విగ్రహానికి ఆకారం ఇస్తున్నారు.
రంగుల విషయంలోనూ నీటి ఆధారిత రంగులను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల నిమజ్జనం సమయంలో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం తగ్గుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
నిమజ్జనం కూడా ఇక్కడే
72 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో నీటిని పంపింగ్ చేసి, విగ్రహాన్ని అక్కడే నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నిమజ్జనం అనంతరం మిగిలే మట్టిని వృథా చేయకుండా ప్రజలు, దుకాణాల నిర్వాహకులు పూలకుండీలు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నిమజ్జనం చేసిన నీటిని కూడా డ్రైనేజీ, కాలువల ద్వారా తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం, పర్యావరణ నష్టం ఏర్పడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. పీఓపీ విగ్రహాల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతూ.. ప్రజలు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు.
భారీ గణపతిని ఏర్పాటు చేయడమే కాకుండా.. నిర్మాణం నుంచి నిమజ్జనం, అనంతరం మట్టి పునర్వినియోగం వరకు ప్రతి దశలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
భక్తి, సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణను కలిపి విజయవాడలో రూపొందిస్తున్న ఈ 72 అడుగుల మహా గణపతి ఈ ఏడాది వినాయక చవితి వేడుకల్లో ప్రత్యేకంగా నిలవనున్నాడు.


