Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్‌లో లాటరైట్ ఖనిజ వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన మార్పుల కారణంగా గనుల రంగంలో ఏర్పడిన అనిశ్చితిపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న గనుల లీజు దరఖాస్తుల విషయంలో తాత్కాలిక సడలింపులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 శాతం.. అంతకంటే ఎక్కువ ఉంటే దానిని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్‌గా (మేజర్ మినరల్) పరిగణించాలని పేర్కొంది. ఈ మార్పుతో రాష్ట్రంలో కొనసాగుతున్న గనుల లీజు ప్రక్రియ ఒక్కసారిగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు తన లేఖలో వివరించారు.
Read Also : ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి.. మహానాడు వేదికగా డిమాండ్ చేసిన చంద్రబాబు..
ఈ కొత్త నిబంధనల కారణంగా మైనర్ మినరల్ కింద ప్రాసెస్ అవుతున్న మొత్తం 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని కేంద్రానికి తెలియజేశారు. వాటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ దరఖాస్తులు, 113 ప్రభుత్వ భూములకు సంబంధించినవి, 255 అటవీ భూములు, అలాగే 15 పట్టా భూముల కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజులు చెల్లించడం నుంచి భూముల కొనుగోలు, అటవీ అనుమతుల వరకు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టారని ముఖ్యమంత్రి తన లేఖలో గుర్తు చేశారు. కొన్ని సందర్భాల్లో ఇది కోట్ల రూపాయల భారంగా మారిందని ఆయన ప్రస్తావించారు.
Read Also : బోత్ ఆర్ నాట్ సేమ్.. మహానాడు సభలో వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు..!
మునుపు మైకా, క్వార్ట్జ్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ నుంచి మేజర్ కేటగిరీకి మార్చినప్పుడు కేంద్రం ‘సేవింగ్ క్లాజ్’ ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ఉదహరించారు. అదే విధానాన్ని ఇప్పుడు లాటరైట్ ఖనిజానికి కూడా వర్తింపజేసి, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారమే పరిశీలించేందుకు కనీసం రెండేళ్ల గడువు ఇవ్వాలని కోరారు. ఈ సడలింపు ఇవ్వడం వల్ల దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం తగ్గుతుందని, అలాగే న్యాయపరమైన వివాదాలు కూడా నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, సేవింగ్ క్లాజ్ అమలుతో సిమెంట్, ఐరన్ ఓర్, రోడ్డు నిర్మాణ రంగాలకు అవసరమైన ముడిసరుకు సరఫరాలో అంతరాయం లేకుండా కొనసాగుతుందని, ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం తగ్గుతుందని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు.
Read Also : విశాఖ రైల్వేజోన్ కల సాకారం.. అధికారంగా అమల్లోకి..


