SCoR | ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్ కల ఎట్టకేలకు సాకారం కాబోతున్నది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయంగా, ప్రజల నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్ అయిన విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘దక్షిణ కోస్తా రైల్వే’ (South Coast Railway) పేరుతో దేశంలో 18వ రైల్వే జోన్‌గా ఇది జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఏపీ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో భాగంగా ఇచ్చిన కీలక హామీలలో విశాఖ రైల్వే జోన్ ఒకటి. అయితే గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ చర్చలకే పరిమితమైందన్న విమర్శలు వినిపించాయి. 2019 కేంద్ర బడ్జెట్‌లో రైల్వే జోన్‌ను ప్రకటించినప్పటికీ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ, డివిజన్ల విభజన, సిబ్బంది కేటాయింపులు వంటి అంశాల కారణంగా అమలు ఆలస్యమైంది. ఇప్పుడు అన్ని ప్రక్రియలు పూర్తికావడంతో జోన్ ప్రారంభానికి మార్గం సుగమమైంది.
Read Also : ఇక మూడుజోన్లకే దక్షిణ మధ్య రైల్వే.. జూన్ నుంచి కొత్త పరిపాలన వ్యవస్థ..!
రైల్వే వ్యవస్థలో పెను మార్పులు..
కొత్త జోన్ ఏర్పాటుతో రైల్వే వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో కొనసాగుతున్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విలీనం చేశారు. అలాగే తూర్పు కోస్తా రైల్వే (ECoR) పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి ‘విశాఖపట్నం డివిజన్’గా మార్చారు. ఈ డివిజన్ కూడా కొత్త జోన్‌లో భాగమవుతోంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుందన్న వార్తలు రావడం కూడా ఇదే కారణం. ఇప్పటివరకు ఆరు డివిజన్లతో విస్తృత పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు మూడు ప్రధాన డివిజన్లకే పరిమితం కానుంది. హైదరాబాద్, నాందేడ్, పునర్వ్యవస్థీకరించిన సికింద్రాబాద్ డివిజన్లతో కొనసాగనుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రభావం తగ్గుతుండగా, విశాఖ కేంద్రంగా కొత్త పరిపాలనా వ్యవస్థ బలపడనుంది. రైల్వే శాఖ భౌగోళిక పరిపాలనను సులభతరం చేయడానికి కొన్ని కీలక మార్గాల సరిహద్దులను కూడా సవరించింది. పలాస-ఇచ్ఛాపురం, రాయచూరు-వాడి వంటి సెక్షన్లలో పరిపాలనా మార్పులు చేశారు. ఈ నిర్ణయాలతో ట్రాక్ నిర్వహణ, ఆపరేషన్ల పర్యవేక్షణ, కొత్త ప్రాజెక్టుల అమలు మరింత వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి కొత్తగా వీక్లీ ట్రైన్స్..!
ఏర్పాట్లు పూర్తి..
జూన్ 1న జరిగే అధికారిక ప్రారంభ కార్యక్రమం కోసం విశాఖపట్నంలో రైల్వే అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉన్నతాధికారులు వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రారంభ దశలో తాత్కాలిక కార్యాలయం నుంచే జోన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇక శాశ్వత ప్రధాన కార్యాలయం నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ఆధునిక సౌకర్యాలతో హెడ్‌క్వార్టర్స్ నిర్మించాలని రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు అనేక ప్రయోజనాలు కలగనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు వేగం అందుకునే అవకాశం ఉంది. కొత్త రైలు మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, సరుకు రవాణా అభివృద్ధి వంటి అంశాల్లో పురోగతి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Read Also : ఏపీలో మండుతున్న ఎండలతో అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
రాష్ట్ర విభజన తర్వాత..
విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు మరిన్ని రైలు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అలాగే స్థానిక సమస్యల పరిష్కారంలో కూడా వేగం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు చిన్న సమస్యల పరిష్కారం కోసం కూడా సికింద్రాబాద్, భువనేశ్వర్ స్థాయిలో అనుమతులు అవసరమయ్యేవి. ఇప్పుడు పరిపాలన విశాఖ నుంచే సాగడంతో నిర్ణయాలు త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన హామీల అమలుపై విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఈ జోన్ ప్రారంభం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ ప్రజల ఎన్నో ఏళ్ల డిమాండ్ నెరవేరడంతో విశాఖ రైల్వే జోన్ కొత్త అధ్యాయంగా నిలువనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also : టాలీవుడ్‌కు ఏపీ నుంచే 75శాతం ఆదాయం.. బాలకృష్ట సంచలన వ్యాఖ్యలు..!


